“పది మంది నేరస్తులు తప్పించుకొన్నా పరువాలేదు కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్షించబడకూడదు,” అనే మాట తరచూ వినబడుతూనే ఉంటుంది. కానీ చాలా కేసులలో అందుకు భిన్నంగా జరుగుతుంది.
అనేకమంది చేయని నేరానికి జైలు పాలవుతుంటారు. అనేకమంది నిర్దోషులు విచారణ పేరిట రిమాండ్ లో నెలలు, సంవత్సరాలు గడుపుతుంటారు. పార్లమెంటు మీద, ప్రజల మీద దాడులు చేసి మారణఖాండ జరిపిన ఉగ్రవాదుల తరపున వాదించేందుకు రాజకీయ పార్టీలు పోటీలు పడుతుంటాయి కానీ పేదరికంగా కారణంగా తమ కేసులపై అప్పీలు కూడా చేసుకోలేని నిరుపేద ఖైదీలను పట్టించుకొనేవారే ఉండరు. సత్యంబాబు కధ కూడా ఇటువంటిదే.
సుమారు తొమ్మిదిన్నరేళ్ళ క్రితం విజయవాడ సమీపంలో ఇబ్రహీంపట్నంలో ఒక లేడీస్ హాస్టల్ లో అయేషా మీరా అనే యువతి అత్యంత దారుణంగా హత్య చేయబడింది. పోలీసులు 9నెలలు దర్యాప్తు చేసి సత్యంబాబు అనే యువకుడే ఆ నేరం చేశాడని చెప్పడంతో ఆ కేసును విచారించిన విజయవాడలోని మహిళా కోర్టు అతనికి జీవిత ఖైదు విదించింది. అతని పిటిషన్ పై సుదీర్గ విచారణ తరువాత ఆ కేసులో అతను నిర్దోషని హైకోర్టు నిన్న ప్రకటించింది. ఆ కేసులో అతనిని అన్యాయంగా ఇరికించారని చెపుతూ జైలు నుంచి తక్షణమే విడుదల చేయాలని నిన్న పోలీసులకు ఆదేశించింది.
సత్యంబాబు నిర్దోషి అని హత్యకు గురైన అయేషా మీరా తల్లి కూడా మొదటి నుంచి గట్టిగా చెపుతూనే ఉన్నారు. అంతే కాదు..తన కూతురిని ఎవరు హత్య చేశారో పేర్లతో సహా ఆమె పోలీసులకు, కోర్టుకు కూడా చెప్పారు. సత్యంబాబు నిర్దోషని, అతనిని విడిచిపెట్టాలని అప్పుడే ఆమె కోర్టును కోరారు. కానీ ఆమె దోషులుగా పేర్కొన్నవారందరూ రాజకీయంగా చాలా పలుకుబడి ఉన్నవారు కనుక వారిని ఈ కేసును తప్పించడానికి అమాయకుడైన సత్యంబాబును దోషిగా చూపించారు. దిగువ న్యాయస్థానం కూడా లోతుగా విచారణ చేసి అసలైన నేరస్తులను గుర్తించే ప్రయత్నం చేయకుండా, నిర్దోషి అయిన సత్యంబాబునే దోషిగా నిర్ధారించి శిక్షలు వేసేసి చేతులు దులుపుకొంది. ఈ కారణంగా ఒక అమాయకుడైన యువకుడు సత్యంబాబు జీవితం నాశనం అయిపోయింది. ఒకవేళ హైకోర్టు కూడా అతను నిర్దోషి అని గుర్తించకపోతే అతను ఎప్పటికీ జైలులోనే మగ్గుతుండేవాడు కదా?
అతనికి కోర్టు ఖర్చుల క్రింద లక్ష రూపాయలు పరిహారం చెల్లించాలని హైకోర్టు చెప్పడం బాగానే ఉంది. అన్యాయంగా ఎనిమిదేళ్ళు జైలు శిక్ష అనుభవించినందుకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం పొందలనుకొంటే వేరేగా కేసు వేసుకోవాలని సూచించింది. అతనికి ఈ శిక్ష పడటానికి కారణమైన వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవడానికి ఈ కేసును అపెక్స్ కమిటీకి అప్పగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదంతా బాగానే ఉంది ఇంతకీ అయేషా మీరాను అతికిరాతకంగా హత్య చేసి తప్పించుకోవడమే కాకుండా ఈ కేసులో అమాయకుడైన సత్యంబాబును ఇరికించి మరో పెద్ద నేరం చేసిన అసలు నేరస్తులను హైకోర్టు శిక్షించకపోతే నేటికీ ఈ కేసులో పూర్తిన్యాయం జరగలేదనే భావించవలసి ఉంటుంది.