సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావుకు ‘ఫేవరేట్ సాఫ్ట్ టార్గెట్’ ఎవరంటే గవర్నర్ నరసింహన్. అవకాశం వచ్చినప్పుడల్లా ఆయనను విమర్శించకుండా ఉండలేరు.
హైదరాబాద్ గాంధీ భవన్ లో నిన్న విలేఖరులతో మాట్లాడుతూ, “ప్రజా సమస్యలను పట్టించుకోకుండా గవర్నర్ నరసింహన్ గుళ్ళూ గోపురాల చుట్టూ తిరుగుతూ కాలక్షేపం చేస్తుండటం చూస్తుంటే, ఆయనను ఆ పదవిలో నియమించి మా యూపియే ప్రభుత్వం తప్పు చేసిందనిపిస్తోంది. రాష్ట్రంలో మిర్చిరైతులు గిట్టుబాటు ధరలు రాక తమ పంట తగులబెట్టుకొంటున్నారు. ఆర్ధిక సమస్యలకు తాళలేక రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. విద్యార్ధులు ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. మరోపక్క పరీక్షా పత్రాలు లీక్ అవుతున్నాయి. ఆసుపత్రులలో సమస్యలు పేరుకుపోయిన కారణంగా రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇన్ని జరుగుతున్నా తెరాస సర్కార్ పట్టించుకోవడం లేదు. అది పట్టించుకోనప్పుడు గవర్నర్ నరసింహన్ అయినా పట్టించుకోవాలి. కానీ ఆయన కూడా ఈ సమస్యలన్నిటినీ గాలికొదిలేసి గుళ్ళూ గోపురాల చుట్టూ తిరుగుతున్నారు. కనుక పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడిని తప్పించమని అక్కడ ఎమ్మెల్యేలు ఉద్యమిస్తున్నట్లే ఇక్కడ కూడా ‘గవర్నర్ కో హటావ్ తెలంగాణా బచావ్’ అని అందరూ ఉద్యమించాల్సి ఉంది,” అని హనుమంతరావు అన్నారు.
గవర్నర్ నరసింహన్ ను యూపియే ప్రభుత్వమే నియమించినప్పటికీ, ఉభయరాష్ట్రాల సమస్యలు, వివాదాల గురించి ఆయనకు మంచి అవగాహన కలిగి ఉన్నందునే మోడీ సర్కార్ కూడా ఆయననే గవర్నర్ గా కొనసాగిస్తోంది. ఆయన కూడా కేంద్రప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొంటూ ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో, వాటి ముఖ్యమంత్రులతో సత్సంబంధాలు కలిగి ఉండటమే కాకుండా వారి మద్య సయోధ్య కుదిర్చి సమస్యల పరిష్కారానికి కూడా చాలా కృషి చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఈవిధంగా తాము నియమించిన గవర్నర్ తమ ప్రత్యర్ధులతో, వాటి ప్రభుత్వాలతో, ప్రభుత్వాధినేతలతో చక్కగా కలిసిమెలిసి పనిచేస్తుండటం జీర్ణించుకోలేకనే హనుమంతరావు విమర్శలు చేస్తున్నట్లున్నారు తప్ప ఆయన చెపుతున్న కారణాలు సహేతుకంగా లేవు.