కాగ్ చేదు..కితాబ్ లే ముద్దు

April 01, 2017


img

ఫలానా విషయంలో తెలంగాణా నెంబర్: 1 స్థానంలో ఉందని కేంద్రప్రభుత్వ సంస్థలు ప్రకటిస్తే అది చాలా ఆనందం కలిగించే విషయమే. అటువంటి ప్రశంశల గురించి తెరాస నేతలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు పదేపదే గొప్పగా చెప్పుకొంటుంటారు. అది సహజమే. కానీ తమ ప్రభుత్వ వైఫల్యాలను, తప్పులను, లోటుపాట్లను ఎత్తిచూపించిన కేంద్రప్రభుత్వ సంస్థ ‘కాగ్’ నివేదిక గురించి తెరాస నేతలు ఎవరూ మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. అదీ సహజమే. కానీ వారు కాగ్ నివేదిక గురించి ప్రతిపక్షాలు మాట్లాడినా సహించలేకపోతున్నారు. కాంగ్రెస్ నేతలు కాగ్ నివేదికలో చెప్పిన అంశాలపై తెరాస ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. 

తెరాస ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ మాట్లాడుతూ “ప్రతీ ఏటా కాగ్ నివేదికలు ఈయడం సాధారణ ప్రక్రియలో భాగం మాత్రమే. కాంగ్రెస్ నేతలు కాగ్ నివేదికపై అనవసరమైన రాద్దాంతం చేస్తున్నారు. తెలంగాణా రాష్ట్రాభివృద్ధికి తెరాస సర్కార్ చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. పాలమూరు అభివృద్ధికి కాంగ్రెస్ నేతలు చేస్తున్న సూచనలను, సలహాలను కూడా మా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిగణనలోకి తీసుకొని పనిచేస్తుంటే కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు,” అని విమర్శించారు.

కాగ్ నివేదిక సాధారణ ప్రక్రియలో భాగమే కావచ్చు కానీ దానిలో పేర్కొన్న ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లు, వివిద పనులలో అవకతవకలు, లోపాలు, పర్యవేక్షణ కోరవడం..ఈ కారణాల చేత వందల కోట్ల ప్రజాధనం వృధాకావడం తేలికగా తీసుకోవలసిన విషయాలు కాదు. 

కాగ్ తన తాజా నివేదికలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును ఎండగట్టి వందల కోట్ల ప్రజాధనం వృధా అవుతోందని చెప్పినప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కానీ వారి ప్రతినిధులు గానీ స్పందించి, కాగ్ నివేదికలో పేర్కొన్న లోపాలను సరిదిద్దుకొంటామని, జరిగిన నష్టాలకు భాద్యత వహిస్తామని చెప్పే సాహసం చేయలేకపోయారు. కేంద్రప్రభుత్వ సంస్థలు నెంబర్: 1 స్థానాలు ప్రకటిస్తే అది తమ గొప్పదనమేనని పదేపదే చెప్పుకోవడం మరిచిపోరు. కేంద్రప్రభుత్వ ప్రశంశలను స్వీకరించి ఆస్వాదిస్తున్నప్పుడు కాగ్ నివేదికను కూడా స్వీకరిస్తే హుందాగా ఉండేది. కానీ కాగ్ నివేదికపై స్పందించకపోగా దానిని పట్టించుకోనవసరం లేదన్నట్లుగా బాధ్యతాయుతమైన ఒక ప్రజా ప్రతినిది చెప్పడం చాలా శోచనీయం. 


Related Post