అవునుకదా మల్లా..

March 29, 2017


img

భాజపా గోవధ నిషేధం విషయంలో ద్వందవైఖరి ప్రదర్శిస్తోందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ఒక వర్గం ప్రజలను లక్ష్యంగా చేసుకొని భాజపా ఈ కుట్ర సాగిస్తోందని విమర్శించారు. ఎన్నికలు, ఓటు బ్యాంక్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొనే భాజపా ఈవిషయంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానం అవలంభిస్తోందని విమర్శించారు. సీతారాం ఏచూరి ట్వీట్ ద్వారా క్లుప్తంగా చేసిన ఈ విమర్శని మరింత లోతుగా పరిశీలించి చూసినట్లయితే అయన విమర్శ సహేతుకమైనదేనని అర్ధం అవుతుంది. 

యూపిలో గోవధపై నిషేధం విధించిన భాజపా గోవాలో బీఫ్ ను నిషేదించడం లేదు. కారణం అక్కడ ఎక్కువ శాతం ఉన్న క్రీష్టియన్లు బీఫ్ ను ఆహారంగా తింటారు. ఒకవేళ అటువంటి ఆలోచన చేస్తే వారి ఆగ్రహానికి గురవుతుంది. కనుక అక్కడ భాజపా ప్రభుత్వమె అధికారంలో ఉన్నప్పటికీ బీఫ్ పై ఎటువంటి నిషేధమూ విదించలేదు. అలాగే ఎన్నికలు జరుగబోయే రాష్ట్రాలలో కూడా “మేము అధికారంలోకి వస్తే గోవధ నిషేదిస్తామని” భాజపా ధైర్యంగా చెప్పలేకపోతోంది. చెపితే ఏమవుతుందో అందరికీ తెలుసు. 

హిందువులు గోవులను పూజిస్తారు కనుక వారిలో అధిక శాతం మంది గోవధను వ్యతిరేకించడం సహజమే. కనుక వారి ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొనే భాజపా ఇటువంటి ఆలోచనలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఒకవేళ భాజపా గోవధను నిజంగా వ్యతిరేకిస్తున్నట్లయితే ప్రస్తుతం ఆ పార్టీయే కేంద్రంలో అధికారంలో ఉంది కనుక దేశంలో గోవధపై నిషేధం విదించవచ్చు కదా? కానీ అంత సాహసం చేయలేకపోతోంది. ఎందుకంటే ఒకవేళ గోవధ నిషేధంపై కటినంగా వ్యవహరించినా కూడా హిందువులు అందరూ గంపగుత్తగా భాజపాకే ఓటేస్తారనే నమ్మకం కూడా లేదు. పైగా దీని వలన మైనార్టీ వర్గ ప్రజలలో భాజపా పట్ల తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం కలగడం తధ్యం. కోర్టుల చేత మొట్టికాయలు వేయించుకోవలసి వస్తుంది కూడా. అందుకే అది ఈ విషయంలో ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్లుగా వ్యవహరిస్తోందని చెప్పక తప్పదు. 


Related Post