లోకేష్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు

March 28, 2017


img

ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మార్చి 30న ఉదయం 9.45 నిమిషాలకు ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఏపి శాసనమండలి చైర్మన్ చక్రపాణి ఆయన చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. అతనిని మంత్రివర్గంలోకి తీసుకోవడం కోసమే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీగా ఎంపిక చేయించారనేది బహిరంగ రహస్యమే కనుక త్వరలోనే మంత్రి పదవి కూడా అప్పగించవచ్చు. 

రాజకీయాలలోకైనా సినిమాలలోకైన మరే రంగంలోకైనా వారసులను తీసుకురావడం సర్వసాధారణమైన విషయమే కానీ వారు తమ సత్తా నిరూపించుకోగలిగినప్పుడే రాణించగలరు. లేకుంటే ఆయాచితంగా లభించిన అధికారం ఎన్నో రోజులు నిలుపుకోలేక నవ్వులపాలయ్యే ప్రమాదం ఉంది. రాహుల్ గాంధీ గత రెండు దశాబ్దాలుగా రాజకీయాలలో, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ తన సత్తా చాటుకోలేక ఏవిధంగా చతికిలపడుతున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. అదే..ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటిఆర్, కుమార్తె కవిత, మేనల్లుడు హరీష్ రావులు తమకు దక్కిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని తమ సత్తా చాటుకొని అటు ప్రజలలోను, ఇటు పార్టీలోను మంచి గుర్తింపు సంపాదించుకోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. 

తన తండ్రికి రాజకీయ వారసుడు కావాలని ఆశిస్తున్న నారా లోకేష్ తన సత్తా నిరూపించుకొనేందుకు ఎక్కడి నుంచైనా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ఉండి ఉంటే అతనికి, తండ్రికి, తెదేపాకు కూడా చాలా గౌరవంగా, హుందాగా ఉండేది. కానీ దొడ్డిదారిన ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చారు. కనుకనే రోజా వంటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఆయనను ఆక్షేపిస్తున్నారు. కనుక నారా లోకేష్ కనీసం ఇక ముందైన తన సామార్ద్యం నిరూపించుకోగలిగితే ఎవరూ ఇక ఆయనను ఆక్షేపించరు. 


Related Post