వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఈరోజు సిబిఐ ఊహించని పెద్ద షాక్ ఇచ్చింది. ఆయన తన అక్రమాస్తుల కేసులలో సాక్షులను ప్రభావితం చేసేవిధంగా వ్యవహరిస్తూ బెయిల్ షరతులను ఉల్లంగిస్తున్నందున అయన బెయిల్ రద్దు చేయవలసిందిగా సిబిఐ అధికారులు సిబిఐ కోర్టులో నేడు ఒక పిటిషన్ వేశారు. దానిని విచారణకు స్వీకరించిన సిబిఐ కోర్టు జగన్మోహన్ రెడ్డిని సంజాయిషీ కోరుతూ నోటీస్ పంపించి ఈ కేసును ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది.
ఈ కేసులో సాక్షిగా ఉన్న మాజీ ప్రధానకార్యదర్శి రమాకాంత రెడ్డి ఇంటర్వ్యూని సాక్షి మీడియాలో ప్రసారం చేసింది. దానిలో ఆయన సిబిఐ గురించి, ఈ కేసుకు సంబందించి అనేక విషయాలు మాట్లాడారు. అంతే కాకుండా ఈ కేసు కోర్టులో నిలబడలేదని చెప్పారు. అది సాక్షులను ప్రభావితం చేయడంగానే భావించి జగన్ బెయిల్ను రద్దు చేయాలని సిబిఐ అధికారులు తమ పిటిషన్ లో సిబిఐ కోర్టును కోరారు.
అదే రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో పనిచేసే సి.ఐ.డి. అధికారులు ఇటువంటి ప్రయత్నం చేసి ఉంటే అది రాజకీయ కక్ష సాధింపు చర్యేనని జగన్ వాదించగలిగి ఉండేవారు. కానీ కేంద్రం అధీనంలో ఉండే సిబిఐ పిటిషన్ వేసినందున ఆ అవకాశం లేదు. కనుక జైలుకు వెళ్ళే ప్రమాదం తప్పించుకొనేందుకు మళ్ళీ న్యాయపోరాటం చేయవలసి ఉంటుంది. ఒకవేళ సిబిఐ కోర్టు ఆయన బెయిల్ రద్దు చేసినట్లయితే హైకోర్టు, సుప్రీంకోర్టు అనే రెండు మార్గాలు ఆయన ముందు ఉంటాయి. కనుక ఆయన అరెస్ట్ అవకాశాలు తక్కువేనని చెప్పవచ్చు. కానీ ఇది స్వయంగా జగన్ కు, ఆయన కుటుంబ సభ్యులకు, వైకాపాకు చాలా ఆందోళన కలిగించే విషయమేనని చెప్పక తప్పదు.