ముస్లిం మాతాచారాల ప్రకారం ఒక వ్యక్తి తన భార్యకు ‘తలాక్.. తలాక్..తలాక్’ అని మూడుసార్లు చెపినట్లయితే వారి వివాహబంధం తెగిపోయినట్లే. అయితే దాని అమలులో పవిత్ర ఖురాన్ లో ఉన్న కటినమైన షరతులు లేదా నిబంధనలను పట్టించుకోకుండా, ఫోన్..ఎస్.ఎం.ఎస్., వాట్స్ అప్ మెసేజ్, ఈమెయిల్ ద్వారా కూడా చాలామంది తమ భార్యలకు తలాక్ సందేశాలు పంపించి విడిచిపెడుతుండటంతో అనేకమంది ముస్లిం మహిళలు, వారి పిల్లలు భవిష్యత్ అకస్మాత్తుగా అగమ్యగోచరంగా మారుతున్నాయి.
నిఖా (పెళ్ళి) సమయంలో వధూవరులు ఇద్దరికీ ‘ఈ పెళ్ళి మీకిష్టమేనా?’ అని అడిగి వారు ‘కబూల్ హై’(అంగీకారమే) అని చెప్పిన తరువాతే వారిద్దరూ దంపతులు అయినట్లు ఖాజీ (మత గురువు) ప్రకటిస్తారు. కానీ విడాకుల విషయంలో ఉన్న మతపరమైన నిబంధనలను పట్టించుకోకుండా అనేకమంది ఎక్కడో దూరదేశాల నుంచి ‘తలాక్’ అనే చిన్న ఫోన్ మెసేజ్ తో తననే నమ్ముకొని జీవిస్తున్న అర్ధాంగిని విడిచిపెట్టేస్తుండటం చాలా దురదృష్టకరం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగుతున్నకొద్దీ ఈ సమస్య ఇంకా తీవ్ర రూపం దాల్చుతుండటం దురదృష్టకరం.
ఈ సమస్య వలన అనేకమంది ముస్లిం మహిళల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. అభం శుభం తెలియని అనేకమంది పిల్లల భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతోంది. ఈ సమస్య రాన్రాను తీవ్రతరం అవుతున్నప్పటికీ ముస్లిం పెద్దలు కానీ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు గానీ దీని పరిష్కారానికి పూనుకోకపోవడంతో సుప్రీంకోర్టు కలుగజేసుకోవలసి వచ్చింది.
సుప్రీంకోర్టు నోటీసు అందుకొన్న కేంద్రం అనేకమంది ముస్లిం మహిళల జీవితాలను చిద్రం చేస్తున్న ఈ ట్రిపుల్ తలాక్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు అఫిడవిట్ లో పేర్కొంది.
ఈ కేసుపై సుప్రీంకోర్టులో నిన్న జరిగిన విచారణలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తరపున వాదించిన న్యాయవాది, “భారత రాజ్యాంగంలోని సెక్షన్: 25 ప్రకారం భారత ప్రభుత్వం లేదా న్యాయస్థానాలకు ముస్లిం మతాచారాలలో కలుగజేసుకొనే అధికారం లేదు. న్యాయస్థానాలు షరియత్ (ఇస్లాం నియమావళి)లో మార్పులు చేర్పులు చేయడానికి లేదా జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించడం అంటే అది పవిత్ర ఖరాన్ గ్రంధాన్ని తిరిగి వ్రాయడంగానే భావించవలసి ఉంటుంది. ఇది అల్లాను, పవిత్ర ఖురాన్ ను అవమానించినట్లే అవుతుంది. కనుక ట్రిపుల్ తలాక్ విషయంలో భారత ప్రభుత్వం లేదా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోరాదు,” అని వాదించారు. సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను సెప్టెంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది.
సున్నితమైన ఈ సమస్యపై న్యాయస్థానం జోక్యం చేసుకోరాదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వాదిస్తున్నప్పుడు, ఈ సమస్య పరిష్కారానికి అది బలమైన చర్యలు తీసుకోవడం చాలా అవసరం. ఈ సమస్య కారణంగా తమ ముస్లిం మహిళలు, చిన్నారుల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయని గుర్తించినప్పుడు, దాని వలన ముస్లిం సమాజంలో ఊహించలేని అనేక సమస్యలు ఎదురవుతున్నాయని గుర్తించినప్పుడు, వాటిని చూడనట్లు ఊరుకోవడం సరికాదనే చెప్పక తప్పదు. చూడనట్లు ఊరుకొన్నట్లయితే సమస్యలు ఇంకా జటిలం అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇంటికి నిప్పు అంటుకొన్నప్పుడు ఆ ఇంటికే కాకుండా ఇరుగు పొరుగు ఇళ్ళకు కూడా దాని వలన ప్రమాదం కలుగుతున్నట్లే, ఈ సమస్య ప్రభావం సమాజం, రాష్ట్రాలు, దేశంపై కూడా పడుతుంది. కనుక ఈ విషయంలో సుప్రీం కోర్టు జోక్యం వద్దనుకొంటే ముస్లిం పెద్దలు, మతగురువులే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడం చాలా మంచిది.