అవును...బడ్జెట్ ను పెంచి చూపిస్తున్నాం: కేసీఆర్

March 28, 2017


img

రాష్ట్ర శాసనసభలో నిన్న టిపిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కి మద్య బడ్జెట్ పై జరిగిన వాదోపవాదాలలో కేసీఆర్ చెప్పిన సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంది. 

తెరాస సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా అంకెల గారడీయేనని, ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి బడ్జెట్ కేటాయింపులకు ఎక్కడా పొంతన లేదని, ప్రజలను మభ్యపెట్టడం కోసమే బడ్జెట్ ను బారీగా పెంచి చూపిస్తోందని ఉత్తం కుమార్ రెడ్డి విమర్శించారు. 

ఆ విమర్శలపై కేసీఆర్ స్పందిస్తూ “అవును బడ్జెట్ ను మేము పెంచి చూపిస్తున్నాము. అది మా ఆశావాహక దృక్పధానికి నిదర్శనం. మీరు అధికారంలో ఉన్నప్పటికీ, ఇప్పటికీ కరెన్సీ విలువలలో చాలా తేడా ఏర్పడింది. కనుక మీ ప్రభుత్వ హయం తీసుకొన్న అప్పులతో నేటి అప్పులను పోల్చి చూడలేము. పైగా ప్రపంచంలో ప్రతీ దేశం, రాష్ట్రం విభిన్నమైన ఆర్ధిక విధానాలు, ఆలోచనలను అమలుచేస్తుంటాయి. మీ ప్రభుత్వం అమర్త్యా సేన్ విధానాలను అమలుచేసేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ సభ్యుడు దీపక్ పరేఖ్ విధానాలను అవలంభిస్తోంది. మా ప్రభుత్వం వారిరువురి విధానాలలో మంచివి మన రాష్ట్రానికి చాలా ఉపయోగపడతాయి అనుకొన్నవాటిని స్వీకరించి మిశ్రమవిదానాన్ని అమలుచేస్తోంది. మా విధానాలను దీపక్ పరేఖ్ కూడా మెచ్చుకొన్నారు.     

ప్రపంచంలో అన్ని దేశాలు, ప్రభుత్వాలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలుచేయడం కోసం అప్పులు తీసుకొంటాయి. మేము కూడా అలాగే తీసుకొంటున్నాము. మన రాష్ట్ర ఆర్దికశక్తి చాలా బలంగా ఉంది. ఈ మాటను నేను ముఖ్యమంత్రి హోదాలో ఆన్ ద రికార్డుగా చెపుతున్నాను. మనకు అప్పు తీర్చే శక్తి ఉంది కనుకనే ఆర్దికసంస్థలు మనకు అప్పులు ఇస్తున్నాయి..మనం తీసుకొంటున్నాము. అప్పులు తీసుకోవడమే కాదు ప్రతీ ఏటా టంచనుగా వాటిని తీరుస్తున్నాము కూడా. 2017-18 ఆర్ధిక సం.లో రూ.20,000 కోట్లు తీర్చబోతున్నాము. మనకు వివిధ మార్గాల ద్వారా ఆదాయం సమకూర్చుకొనే వెసులుబాటు ఉంది కనుకనే ఆశావాహకమైన బడ్జెట్ ను ప్రవేశపెట్టాము. అందులో దాపరికమేమీ లేదు,” అని కేసీఆర్ బదులిచ్చారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకవేళ తమ బడ్జెట్ లో ఎటువంటి తప్పులు లేవని వాదిస్తూ కాంగ్రెస్ వాదనలను త్రిప్పికొట్టే ప్రయత్నం చేసి ఉండి ఉంటే, తెరాస సర్కార్ ను విమర్శించేందుకు ప్రతిపక్షాలకు అవకాశం ఉండేది. కానీ ఉన్నది ఉన్నట్లు నిర్భయంగా చెప్పడం వలన ప్రతిపక్షాలకు తమను వేలెత్తి చూపే అవకాశం లేకుండా చేశారని చెప్పవచ్చు. 


Related Post