పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమాను తాను చూశానని, అది చాలా బాగుందని, సినిమాలో కూడా చేనేత వస్త్రాలను ధరించి చేనేతను ప్రమోట్ చేసినందుకు, పవన్ కళ్యాణ్, నిర్మాత శరత్ మరార్ కు నా అభినందనలు అంటూ మంత్రి కేటిఆర్ ట్వీట్ చేశారు. ఆయన అంతవరకే పరిమితం అయితే ఏ సమస్య ఉండేది కాదు. కానీ ఆయన ఇటీవల పవన్ కళ్యాణ్ తో కలిసి తీసుకొన్న ఒక ఫోటోను కూడా దానికి జత చేయడంతో విమర్శలు మొదలయ్యాయి. ఇక కేటిఆర్ ట్వీట్ కు కృతజ్ఞతలు చెపుతూ పవన్ కళ్యాణ్ పోస్ట్ చేసిన ట్వీట్ మెసేజ్ అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.
“నా సినిమాను చూసి నన్ను అభినందించినందుకు మంత్రి కేటిఆర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. నాలుగు వారాల క్రితమే మేమిద్దరం కలిసి డిన్నర్ చేశాము. నిజానికి ఆ సమావేశం ఎప్పుడో జరుగవలసి ఉంది కానీ ఇద్దరికీ తీరికలేకపోవడం అనేకసార్లు వాయిదా పడింది. చివరకి నెలరోజుల క్రితం కలువగలిగాము. ఆ సమావేశంలో ఇద్దరం వర్తమాన రాజకీయాల గురించి, చేనేత రంగం అభివృద్ధి గురించి చర్చించుకొన్నాము,” అని పవన్ కళ్యాణ్ జవాబిచ్చారు.
గతంలో పవన్ కళ్యాణ్, తెరాస నేతలు పరస్పరం చాలా తీవ్రంగా విమర్శించుకొన్న సంగతి తెలిసిందే. వాటి గురించి ఇప్పుడు ఆలోచించడం అనవసరమే. ఎందుకంటే కేసీఆర్ ను విమర్శించిన కాంగ్రెస్, తెదేపా నేతలు చాలా మంది ప్రస్తుతం తెరాసలో కీలక పదవులలో ఉన్నారు. అలాగే తెరాసకు బద్దవిరోధి అయిన తెదేపాకు చెందిన బాలకృష్ణతో కూడా తెరాస సర్కార్ కు మంచి అనుబంధమే ఉంది. కనుక పాత విషయాల గురించి ఆలోచించడం అనవసరమే. కానీ భవిష్యత్ రాజకీయ పరిణామాల గురించి ఆలోచిస్తే వారి కలయిక, ఈ పరస్పర అభినందనలు..పొగడ్తలు ఆశ్చర్యం కలిగించకమానవు.
వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ తెలంగాణాలో కూడా పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్, తెరాసల మద్య నెలకొన్న శత్రుత్వం దృష్ట్యా ఆ రెండు పార్టీలు కలిసే అవకాశం లేదని భావించవచ్చు. పైగా పవన్ కళ్యాణ్ ఆంధ్రా మూలాలు, తెదేపా పట్ల ఆయన కనబరుస్తున్న మెతక వైఖరి వంటివన్నీ ఆ రెండు పార్టీల మద్య అడ్డుగోడలా నిలిచి ఉన్నాయి. కనుక వచ్చే ఎన్నికలలో తెరాసను జనసేన డ్డీ కొనబోతోందనుకోవచ్చు. మరి అటువంటప్పుడు కేటిఆర్, పవన్ కళ్యాణ్ తో కలిసి డిన్నర్ చేయడం, ఫోటో దిగి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం...మేమిద్దరం కలిసినప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుకొన్నామని పవన్ కళ్యాణ్ చెప్పడం దేనికి సంకేతం?అని అందరూ అనుకొనేలాగ చేస్తోంది. వాళ్ళిద్దరూ ఏ రాజకీయ ఉద్దేశ్యాలు లేకుండానే కలిసినప్పటికీ, వారి అభినందనలు కాటమరాయుడు సినిమాకు, చేనేతకు మాత్రమే పరిమితం అనుకొన్నప్పటికీ అవి అందరిలో చాలా ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి..ఊహాగానాలకు తావిస్తున్నాయని చెప్పక తప్పదు.