ఇందిరా పార్క్ వద్ద నుంచి ధర్నాచౌక్ ను నగరశివార్లలోకి తరలించడాన్ని నిరసిస్తూ ఆదివారం వామపక్షాలు, ప్రజాసంఘాలు బాగ్ లింగంపల్లి వద్ద గల సుందరయ్య విజ్ఞానకేంద్రం నుంచి ఇందిరాపార్క్ వరకు తలపెట్టిన 2కె రన్ ను పోలీసులు అడ్డుకొని టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తో సహా అనేకమందిని అరెస్ట్ చేశారు. తెరాస సర్కార్ చాలా నిరంకుశంగా వ్యవహరిస్తూ తనను ప్రశ్నిస్తున్న వారి గొంతులను అణచివేస్తోందని వారు విమర్శించారు.
వారి విమర్శలను పక్కనపెట్టి చూస్తే, ధర్నా చౌక్ విషయంలో తెరాస సర్కార్ అనవసరమైన పంతానికిపోయి తన పట్ల ప్రజలలో వ్యతిరేకభావనలు కలిగేలా చేస్తోందనిపిస్తుంది. నిరుద్యోగ ర్యాలీని అడ్డుకొన్నప్పుడే సర్వత్రా విమర్శలు వినిపించాయి. ధర్నాచౌక్ విషయంలో తెరాస సర్కార్ వైఖరి వలన ప్రజలలో దానిపై ఇంకా దురభిప్రాయం పెరిగే అవకాశం ఉంటుంది.
ధర్నా చౌక్ కోసం పోరాడుతున్నవారిని ఎక్కడిక్కడ అడ్డుకొని అరెస్టులు చేయడం ప్రభుత్వానికి కష్టమేమీ కాదు కానీ అలాగ చేయడం వలన దానికి లాభం లేకపోగా అది తనను ప్రశ్నిస్తున్న వారి పట్ల చాలా నిరంకుశంగా వ్యవహరిస్తున్నట్లు ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపించిన్నట్లు అవుతోంది.
తెరాస సర్కార్ గ్రహించవలసిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ధర్నాచౌక్ ను కంటికి కనబడనంత దూరానికి తరలించినంత మాత్రాన్న పోరాటాలు ఆగవని! పైగా ఆ నిర్ణయం ప్రజలకు తప్పుడు సంకేతాలు, ప్రతిపక్షాలకు, ప్రజా సంఘాలకు ఇటువంటి సరికొత్త అవకాశాలు కల్పిస్తున్నట్లువుతోంది. కనుక ఈ నిర్ణయం వలన ప్రభుత్వానికి లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతున్నట్లు చెప్పవచ్చు.
గతంలో ఉస్మానియా, టీబీ ఆసుపత్రులను, సచివాలయాన్ని కూల్చివేస్తామన్నప్పుడు కూడా సర్వత్రా ఈవిధంగానే వ్యతిరేకత ఎదురైనప్పుడు తెరాస సర్కార్ వెనక్కి తగ్గవలసివచ్చింది. దాని వలన చాలా అప్రదిష్ట మూటగట్టుకొని చేజేతులా ప్రతిపక్షాలకు ఒక విజయం అందించినట్లయింది.
ధర్నా చౌక్ విషయంలో కూడా మళ్ళీ అదే జరిగే అవకాశం కనబడుతోంది. దీనిపై ఇంకా ఎంత ఎక్కువ రాద్దాంతం జరిగిది అంత తెరాస సర్కార్ కే చెడ్డపేరు వస్తుంది. అప్పుడు వెనక్కి తగ్గినా జరుగవలసిన నష్టం జరిగిపోతుంది కనుక ఇప్పుడే వెనక్కి తగ్గడం మేలేమో ఆలోచించుకొంటే మంచిది.