ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఒక ఆసక్తికరమైన విమర్శ చేశారు. “కేసీఆర్ తన పార్టీ నేతలు, కార్యకర్తలను, ప్రజలను సర్వే నివేదికలను చూపిస్తూ భ్రమలలో ఉంచుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో నెలకొని ఉన్న వాస్తవ పరిస్థితులను చెప్పడంలేదు. తెరాస పాలన పట్ల ప్రజలు చాలా అసహనంగా ఉన్నారనే సంగతి తెరాస నేతలందరూ తెలుసుకొంటే వారికే మంచిది. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయం. దానిని 100మంది కేసీఆర్ లు వచ్చినా అడ్డుకోలేరు,” అని అన్నారు.
ఒకవేళ పొంగులేటి వాదన సరైనదే అనుకొంటే దాని వలన ఎవరికి నష్టం జరుగుతుందని ఆలోచిస్తే తెరాసకేనని అర్ధం అవుతుంది. కానీ కేసీఆర్ స్వయంగా తన పార్టీకి నష్టం కలిగించుకోరు కదా? ఒకవేళ ప్రజలలో తెరాసకు వ్యతిరేకత ఉందని ఆయన భావిస్తున్నట్లయితే దానికి తక్షణమే నివారణ చర్యలు చేపడతారు తప్ప అందరితో పాటు తను కూడా కళ్ళు మూసుకొని పగటికలలుకంటూ కూర్చోరు కదా?
తెరాసకు 101-106 సీట్లు వస్తాయని చెప్పడం ఆయన ఆత్మవిశ్వాసానికి, తన పాలనపై తనకున్న నమ్మకానికి, ప్రజలపై ఆయనకున్న నమ్మకానికి, అలాగే తమ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఉందనే నమ్మకానికి నిదర్శనంగా భావించవలసి ఉంటుంది తప్ప ఆత్మవంచన చేసుకోవడంగా చూడరాదు. అన్ని సీట్లు తప్పకుండా గెలుచుకొంటామని చెప్పడం ద్వారా తెరాస నేతలలో కూడా ఆత్మవిశ్వాసం, ఉత్సాహం పెరుగుతుంది. ఒక సైన్యాధ్యక్షుడు యుద్దానికి ముందు తన సైన్యాన్ని ఏవిధంగా ఉత్సాహపరిచి యుద్దానికి సన్నధం చేస్తారో, కేసీఆర్ కూడా తన నేతలను అలాగే సన్నధం చేస్తున్నట్లుగా దీనిని చూడవలసి ఉంటుంది.
గ్రేటర్ ఎన్నికలకు ముందు “తమ పార్టీ ఎవరితో పొత్తులుపెట్టుకోకుండానే 100 సీట్లు సాధిస్తామని కేసీఆర్ ప్రకటించి దానిని నిరూపించి చూపారు. అలాగే ఇదీ సాధ్యం కావచ్చు కాకపోవచ్చు. కానీ ఇది కూడా ఎన్నికల యుద్దసన్నాహలలో భాగంగానే చూడవలసి ఉంటుంది. ఆ మాటకొస్తే కేసీఆర్ ను విమర్శిస్తున్న ప్రతిపక్ష పార్టీలు కూడా వచ్చే ఎన్నికలలో తమ పార్టీలే బంపర్ మెజారిటీతో విజయం సాధించి అధికారం చేజిక్కించుకొంటామని చెపుతున్నాయి కదా. అవి చెప్పుకోగాలేనిదీ అధికారంలో తెరాస చెప్పుకొంటే తప్పేమిటో అర్ధం కాదు.
కేసీఆర్ తన పార్టీ నేతలను ఒకపక్క ఈవిధంగా ప్రోత్సహిస్తూనే, మళ్ళీ వారి పనితీరును సమీక్షించి ర్యాంకులు ఇవ్వడం, అందరూ తమ ర్యాంకులు మెరుగుపరుచుకోవడానికి తప్పనిసరిగా ప్రజలతో మమేకం అయ్యి వారి సమస్యల పరిష్కరించాలని ఆదేశించారు. అంటే క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి కూడా ఆయన ఆలోచిస్తున్నారని అర్ధం అవుతోంది. కానీ ఈ విషయం గురించి ఎవరూ పెద్దగా మాట్లాడరు.
ఒకవేళ పొంగులేటి చెపుతున్నట్లుగా క్షేత్రస్థాయిలో చాలా సమస్యలు నెలకొని ఉండి వాటిని తెరాస ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోతే వచ్చే ఎన్నికలలో దానికి వారే తప్పకుండా మూల్యం చెల్లించుకోకతప్పదు. 2014 ఎన్నికలలో టీ-కాంగ్రెస్ ఓటమే అందుకు చక్కటి ఉదాహరణ.
ప్రస్తుతం ప్రజలు రాజకీయంగా చాలా చైతన్యంగా ఉంటున్నారు. పైగా వారి చేతులో ‘సోషల్ మీడియా’ అనే బలమైన ఆయుధం కూడా ఉంది. కనుక ఇదివరకటి రోజుల్లోలాగ రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల పట్ల నిర్లక్ష్యంగా, అసమర్ధంగా, అవినీతితో వ్యవహరిస్తే అటువంటి వారిని ప్రజలు నిర్దాక్షిణ్యంగా దించేస్తున్నారు. అందుకు తాజా ఉదాహరణగా యూపి ఫలితాలను చెప్పుకోవచ్చు.
కనుక తెరాస అయినా తెదేపా అయినా చివరికి మోడీ సర్కార్ అయినా సరే ప్రజలకు తప్పనిసరిగా ఫలితాలు చూపించవలసి ఉంటుంది. ఈ విషయం కేసీఆర్ కు తెలియదనుకోలేము. కనుక కాంగ్రెస్ నేతలు పగటికలలు కంటూ సమయం వృదా చేసుకొనే బదులు ఇప్పటి నుంచే తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికో అది సాధ్యం కాదనుకొంటే తమ రాజకీయ భవిష్యత్ గురించో ఆలోచించుకోవడం చాలా మంచిది.