ఆరాధన మృతికి గుండెపోటే కారణమట!

March 27, 2017


img

హైదరాబాద్ లోని ఒక జైన వ్యాపార కుటుంబానికి చెందిన ఆరాధన సముదారియా అనే 13 ఏళ్ళ విద్యార్ధిని తన కుటుంబ కష్టాలు తీరాలని కోరుకొంటూ, తమ మతాచారాల ప్రకారం 68 రోజులు నిరాహార దీక్ష చేసి గత ఏడాది జూన్ 2న చనిపోయిన ఘటన దేశ వ్యాప్తంగా ఎంత కలకలం సృష్టించిందో బహుశః అందరికీ గుర్తుండే ఉంటుంది. 

అన్ని రంగాలలో దేశం అభివృద్ధిపధంలో దూసుకుపోతున్న ఈరోజుల్లో హైదరాబాద్ వంటి మహానగరంలో ఇటువంటి మూడాచారాలకు అభంశుభం తెలియని ఒక బాలిక బలైపోవడం సిగ్గుచేటు. ఆమెను వారించవలసిన తల్లితండ్రులు, బంధువులు, జైన సమాజం ఆమెను ప్రోత్సహించి చివరికి ఆమె మరణానికి కారకులయ్యారు. పైగా ఆమె శవాన్ని అందంగా అలంకరించి, ఒక రధంవంటి వాహనంలో కూర్చోబెట్టి ఊరేగింపుగా శ్మశానానికి తీసుకువెళ్ళి అంత్యక్రియలు చేశారు. ఆమె ఆవిధంగా నిరాహార దీక్ష చేసి బలిదానం చేసుకోవడాన్ని వారందరూ గట్టిగా సమర్దించుకోవడమేకాకుండా, తమ మాతాచార, వ్యవహరాలలో పోలీసులు, ప్రభుత్వం తలదూర్చరాదని గట్టిగా హెచ్చరించారు. 

అప్పటి నుంచి ఈ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆమెని నిరాహారదీక్ష చేయమని ఎవరూ ఒత్తిడి చేయలేదని, ఆమె గుండెపోటుతో మరణించింది తప్ప నిరాహారదీక్ష కారణంగా కాదని, కనుక ఈ కేసును మూసి వేస్తున్నామని బాలల హక్కుల సంఘానికి లిఖితపూర్వకంగా తెలియజేశారు. 

ఒక బాలిక మరణానికి కారకులైనవారిని పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానంలో నిలబెట్టకుండా ఉద్దేశ్యపూర్వకంగానే ఈ కేసును నీరుగార్చారని బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధ రావు ఆరోపించారు. దీనిపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. 

ఆరాధన (నిరాహారదీక్ష చేసి) చనిపోవడం వలననే ఈ సంగతి బయటి ప్రపంచానికి తెలిసింది. ఇటువంటి మూడాఛారాలను పెంచిపోషిస్తున్నవారు దానిని గట్టిగా సమర్ధించుకోవడం గమనిస్తే, దేశావ్యాప్తంగా ఇంకా ఎంతమంది అమాయక బాలికలు ఈ మూడాఛారాలకు బలైపోతున్నారో ఎవరికీ తెలియదు. కోడి పందాలు, జల్లికట్టు వంటివి తప్పు అని వాదిస్తున్న సమాజం, అభం శుభం తెలియని ఒక బాలిక కళ్ళ ముందే దయనీయ పరిస్థితులలో చనిపోతుంటే కరుణతో కాపాడుకోవలసిందిపోయి, ఆమెను చనిపోమని ప్రోత్సహించడం నేరం కాదా?

ఒక సమాజమే ఇటువంటి దురాచారాలను ప్రోత్సహిస్తున్నప్పుడు, చట్టాన్ని అమలుచేయవలసిన పోలీసులు కళ్ళుమూసుకోవడం సబబు కాదు. సతీసహగమనం, బాల్యవివాహాలు వంటి అనేక దురాచారాలను కూడా ఇదేవిధంగా సమర్ధించి ఉండి ఉంటే నేడు మన దేశం ఏ పరిస్థితిలో ఉండేది? అని పోలీసులు, న్యాయవ్యవస్థలు, ప్రజలు అందరూ కూడా ఆలోచించుకోవాలి. 


Related Post