అవును..తెలంగాణా ఏర్పాటును వ్యతిరేకించా: తలసాని

March 27, 2017


img

ఒకప్పుడు తెలంగాణా రాష్ట్రం కోసం ఉవ్వెత్తున సాగిన ఉద్యామాలను, తెలంగాణా ఏర్పాటును వ్యతిరేకించినవారికే తెలంగాణా ప్రభుత్వంలో మంత్రులుగా అవకాశం కలిగిందని ప్రతిపక్షాలు, టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తదితరులు తరచూ విమర్శలు చేస్తుంటారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వారిలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఒకరు. అదే విషయాన్ని ఆయన స్వయంగా నిన్న దృవీకరించారు. సంగారెడ్డిలో గొర్రెల కాపరులు, మత్స్యకార సహకార సంఘాల సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, “అవును..ఆనాడు నేను తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించాను. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోలేకనే ఆనాడు నేను వ్యతిరేకించాను. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం ఎంతగా అభివృద్ధి చెందుతుందో కళ్ళారా చూసిన తరువాత ఆనాడు నాకున్న అభిప్రాయం తప్పని అర్ధం అయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణా రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్: 1 స్థానంలో నిలిపేందుకు గట్టిగా కృషి చేస్తున్నారు,” అని అన్నారు. 

అయితే తలసాని అప్పుడు తెదేపాలో ఉన్న కారణంగానే దాని వైఖరికి అనుగుణంగా తెలంగాణా ఏర్పాటును వ్యతిరేకించారనేది బహిరంగ రహస్యమే. ఈవిషయంలో తెదేపా నేతల కంటే కాంగ్రెస్ నేతలు చాలా ధైర్యంగా సమైక్య రాష్ట్రంలోని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి, డిల్లీలోని తమ అధిష్టానానికి ఎదురొడ్డి తెలంగాణా సాధన కోసం పోరాదిన సంగతి అందరికీ తెలుసు. కానీ వారందరూ ఈ రాజకీయ చదరంగంలో ఓడిపోగా తెలంగాణాను వ్యతిరేకించిన తెదేపా నేతలు మాత్రం విజయం సాధించడం విచిత్రం. తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వర రావు, కడియం శ్రీహరి అందుకు ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తున్నారు.    


Related Post