తెరాస ఎంపిలకు కేసీఆర్ ర్యాంకులు

March 25, 2017


img

తెరాస ఎంపిల పనితీరు, ప్రజాధారణ ఏవిధంగా ఉందని తెలుసుకొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక సర్వే చేయించారు. ప్రగతి భవన్ లో ఈరోజు తన ఎంపిలతో సమావేశమైన కేసీఆర్ ఆ నివేదిక ఆధారంగా ఆయన తన ఎంపిలకు ర్యాంకులు కేటాయించారు. ఆ పూర్తి వివరాలు మీడియాకు తెలియజేయలేదు కానీ వారిలో వినోద్, బాల్క సుమన్ లు మొదటి రెండు స్థానాలలో ఉండగా బూర నర్సయ్య గౌడ్, మల్లారెడ్డి, సీతారాం నాయక చివరి స్థానంలో ఉన్నట్లు సమాచారం. మరి తన కుమార్తె, నిజామాబాద్ ఎంపి కవితకు కేసీఆర్ ఎంత ర్యాంక్ ఇచ్చారో తెలియవలసి ఉంది.  

అదే విధంగా ఎమ్మెల్యేలలో గాదరి కిషోర్, పి మధుల పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కనుక ర్యాంకులలో వెనుకబడిన వారు అందరూ తమతమ నియోజక వర్గాల ప్రజలతో మమేకం అయ్యి వారి సమస్యల పరిష్కారానికి గట్టిగా కృషి చేయాలని సూచించారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసమావేశంలో మరో కొత్త విషయం కూడా చెప్పినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలలో తెరాసకు ఖచ్చితంగా 101 నుంచి 106 వరకు అసెంబ్లీ సీట్లు, 15 ఎంపి సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. హైదరాబాద్ లో ఒక్క సీటు మళ్ళీ మజ్లీస్ పార్టీయే దక్కించుకోవచ్చని చెప్పారు. 

సరిగ్గా ఇవ్వాళ్ళే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ తమ పార్టీ నేతలతో మాట్లాడుతూ, “మోడీ ప్రబావంతో  యూపి, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ఏవిధంగా భాజపా ఘన విజయం సాధించిందో, అదే విధంగా తెలంగాణాలో కూడా వచ్చే ఎన్నికలలో భాజపా ఘన విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం,” అని చెప్పినట్లు సమాచారం. 

కాంగ్రెస్  ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చే ఎన్నికలలో తమ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి రాబోతోందని, కేసీఆర్ గెలిచినట్లయితే తాను రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించేశారు. 

ఇక తెదేపా సంగతి సరేసరి. వచ్చే ఎన్నికలలో తమ పార్టీయే గెలిచి ముఖ్యమంత్రి అధికార నివాసంపై తెదేపా జెండా ఎగురవేయబోతోందని ప్రకటించేసింది. ఈవిధంగా ఎవరికి వారు వచ్చే ఎన్నికలలో తామే అధికారం వచ్చేయబోతున్నట్లు గట్టిగా నమ్ముతున్నారు. మరి తెలంగాణా ప్రజలు ఎవరికి అధికారం అప్పజెప్పుతారో చూడాలి. 


Related Post