చిన్ని చిన్ని ఆశ...

March 23, 2017


img

రాజకీయాలపై ఆసక్తి, అందుకు అవసరమైన శక్తి సామర్ధ్యాలు ఉన్నవారు వాటిలో చేరడం సహజమే. అలాగే వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగ సంఘాలు, యూనివర్సిటీలలో విద్యార్దీ సంఘాలు ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా పని చేస్తుండటాన్ని ఎవరూ తప్పు పట్టలేరు. ఇప్పుడు చాలా రాష్ట్రాలలో చాప క్రింద నీరులా పరుచుకొంటున్న అనేకానేక సమస్యలు కారణంగా ప్రజలందరూ తప్పనిసరిగా ఏదో ఒక రాజకీయ పార్టీలో సభ్యత్వం తీసుకోవడం చాలా అవసరమనే భావన కలుగుతోంది. అధికార పార్టీలు చేపడుతున్న సభ్యత్వ నమోదు ప్రక్రియలో నానాటికి సభ్యుల సంఖ్య పెరుగుతుండటమే అందుకు ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

ప్రజలకు నిజంగానే రాజకీయ ఆసక్తి ఉండి వాటిలో చేరుతుంటే అది చాలా హర్షణీయమే. దేశంలో ప్రజలందరూ ఏదో ఒక రాజకీయ పార్టీలో సభ్యత్వం కలిగి ఉంటే ప్రజలలో రాజకీయ చైతన్యం చాలా పెరిగిందని గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ తమకు ఎవరి వలన ఇబ్బందులు ఎదురవకుండా ఉన్నంతలో సుఖంగా జీవనం సాగించడం కోసమే ఏదో ఒక పార్టీలో సభ్యత్వం స్వీకరించడం అవసరమని ప్రజలు భావిస్తుండటం చాలా అవాంచనీయమైన పరిణామమే. దీనినే మరోవిధంగా చెప్పుకొంటే ప్రజలు ‘సోషల్ సెక్యూరిటీ’ కోసమే రాజకీయ పార్టీలలో చేరుతున్నారనుకోవచ్చు. స్వేచ్చగా జీవించవలసిన ప్రజలు ఈవిధంగా రాజకీయ పార్టీల ద్వారా ‘సోషల్ సెక్యూరిటీ’ పొందవలసివస్తే అంతకంటే దురదృష్టకరమైన పరిణామం మరొకటి ఉండదు. 

రాష్ట్రంలో ఇప్పటివరకు సి.ఐ.టి.యు.లో ఉన్న ఆశా వర్కర్లు అందరూ తెరాసలో చేరాలని నిర్ణయించుకోవడాన్ని ఇందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సి.ఐ.టి.యు ద్వారా వారి సమస్యలు పరిష్కారం కాకపోగా వాటి కోసం వారు చేసే పోరాటాలు ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించడం సహజం. కనుక దీనికి సరైన పరిష్కారం అందరూ తెరాసలో చేరిపోవడమేనని భావించారు. ఇంతవరకు తాము చేసిన తప్పులన్నిటినీ (?) ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో క్షమించి తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. అంటే తమ జీతాలు పెంచాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇంతకాలం వారు చేసిన పోరాటాలను ‘తప్పు’ అని చెప్పుకోవలసిరావడం, అందుకు వారు ముఖ్యమంత్రిని క్షమాపణలు కోరడం, ఆ ‘తప్పులకు ప్రాయశ్చిత్తంగా తెరాసలో జేరాలనుకోవడం మొదలైనవన్నీపైన చెప్పుకొన్న ‘సోషల్ సెక్యూరిటీ’ వాదనను బలపరుస్తునట్లుంది. అందుకు సంతోషించాలా బాధపడాలా?


Related Post