ఏపి అసెంబ్లీలో ఈరోజు అగ్రిగోల్డ్ బాదితుల సమస్యపై తెదేపా-వైకాపాల మద్య చాలా తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. కానీ రెండు పార్టీలు వారి సమస్యకు పరిష్కారం చూపలేకపోయాయి. చివరకు ఆ చర్చ పక్కదారి పట్టడం విశేషం. 
అగ్రిగోల్డ్ భాదితుల సమస్యలు గురించి జగన్ సభకు చాలా చక్కగానే వివరించారు. కానీ అగ్రిగోల్డ్ యాజమాన్యంతో ప్రభుత్వం కుమ్మకు అయ్యిందని అందుకే దానికి విలువైన ఆస్తులున్నా వాటిని అమ్మి భాధితులకు న్యాయం చేయకుండా ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని జగన్ విమర్శించడంతో చర్చ పక్కదారి పట్టింది. ఆ తరువాత మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేశారని జగన్ ఆరోపించడంతో రాజీనామాలు, రాజకీయ సన్యాసాలు, విచారణల తంతు నడిచింది. ఈ సందర్భంగా చంద్రబాబు-జగన్ మద్య, పుల్లారావు-జగన్ మద్య తీవ్ర తీవ్ర వాగ్వాదాలు జరిగాయి.
మళ్ళీ వాటి మద్యలో... గత నెల అమరావతిలో జరిగిన మహిళా పార్లమెంటు సమావేశాలకు ముందు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలను సాక్షి మీడియా వక్రీకరించిన విషయంపై ఇరుపక్షాల మద్య వాదన చెలరేగింది. దానితో చర్చ పూర్తిగా పక్కదారి పట్టింది. ఆనాడు తాను ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటల వీడియో క్లిప్పింగును సభలో ప్రదర్శిస్తామని చెప్పి స్పీకర్ 10 నిమిషాలు సభను వాయిదా వేయగానే, వైకాపా నిరసన తెలియజేస్తూ బయటకు జారుకొంది.
సభ వెలుపల రోజా, జగన్ మీడియాతో మాట్లాడుతూ, “తెదేపా ఉద్దేశ్యపూర్వకంగానే సభలో చర్చను పక్కదారి పట్టించడానికే ఎప్పుడో జరిగిన విషయాన్ని ఇప్పుడు బయటకు తీసి చర్చ మొదలుపెట్టారని ఆరోపించారు. స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకొంటున్నట్లు చెప్పారు.
ఇక సభ లోపల తెదేపా, భాజపా సభ్యులు ఆ వీడియోను చూసిన తరువాత స్పీకర్ పట్ల అనుచితంగా వ్యాఖ్యలు చేసినందుకు సాక్షి ఎడిటర్ లేదా యజమానిని సభకు పిలిపించి మందలించాలని స్పీకర్ ను కోరారు.
అగ్రిగోల్డ్ భాధితుల సమస్యపై తక్షణం చర్యలు తీసుకొనేవిధంగా ప్రభుత్వంపై ఒత్తిడి చేయవలసిన జగన్, తెదేపా సర్కార్ పై అవినీతి ఆరోపణలు చేసి చర్చను పక్కదారి పట్టించేందుకు అవకాశం కల్పించారని చెప్పక తప్పదు. అలాగే జగన్ అంత గంభీరమైన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే దానిపై తక్షణం చర్యలు చేపట్టవలసిన ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయకుండా సాక్షి మీడియా ప్రస్తావన చేసి జగన్ పై ఎదురుదాడికి ప్రయత్నించడం కూడా తప్పే. చివరికి తెదేపా, వైకాపాలు అగ్రిగోల్డ్ భాధితుల సమస్యలను పక్కన పెట్టేసి శాసనసభలో ఆధిపత్యపోరు సాగించడం విస్మయం కలిగిస్తుంది.