బడాయి కాంగ్రెస్..ఎప్పుడూ అదే గోల

March 23, 2017


img

కాంగ్రెస్ హయంలో తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన 2014 ఎన్నికలలో ఆ పార్టీ అవలీలగా విజయం సాధించి ఉండాలి కానీ తెరాస చేతిలో ఓడిపోయింది. నిజానికి అది తెరాస చేతిలో ఓడిపోలేదు తన స్వీయ తప్పిదాల వలననే ఓడిపోయిందని చెప్పవచ్చు. 

తమ యూపిఏ ప్రభుత్వమే తెలంగాణా ఇచ్చిన సంగతిని ప్రజలకు నచ్చజెప్పుకోవడంలో టీ-కాంగ్రెస్ నేతల అశ్రద్ద లేదా నిర్లక్ష్యం, తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారి జరుగుతున్న ఎన్నికలు అత్యంత కీలకమైనవని గుర్తించి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు రచించుకోవలసిన సమయంలో తమలోతామే కుమ్ములాడుకోవడం, పార్టీని ఏవిధంగా గెలిపించుకోవాలని ఆలోచించవలసిన సమయంలో పిసిసి అధ్యక్ష పదవి కోసం పోటీలు పడటం, తమకు, తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు పార్టీ టికెట్లు సాధించేందుకు డిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేయడం, రాష్ట్ర స్థాయిలో పార్టీకి బలమైన నాయకత్వం లేకపోవడం వంటి అనేకానేక కారణాలు కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణాలుగా చెప్పుకోవచ్చు. 

ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవలసి వస్తోందంటే, నేటికీ టి-కాంగ్రెస్ నేతల ఆలోచనలలో..వ్యవహార శైలిలో ఎటువంటి మార్పులు రాలేదని చెప్పడం కోసమే. సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలే అందుకు తాజా ఉదాహారణ. 

ఆయన నిన్న మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, “నేను ముఖ్యమంత్రి రేసులో లేను. ఒకవేళ మా అధిష్టానం జానారెడ్డిని మా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటిస్తే నేను ఆయనకు మద్దతిస్తాను. మా అధిష్టానం స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిని మా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించలేదు. ఆయనే దానిని సాధించుకొన్నారు. మా పార్టీలో ఎవరికీ అవకాశాలు కల్పించబడవు. లాబీయింగ్ చేసుకొని అవకాశాలు సంపాదించుకోవలసి ఉంటుంది. వచ్చే ఎన్నికలలో కేసీఆర్ గెలిచినట్లయితే నేను రాజకీయాల నుంచి శాస్వితంగా తప్పుకొంటాను,” అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

రాష్ట్రంలో తమ పార్టీ పరిస్థితిని సీనియర్ నేతలు కళ్ళారా చూస్తున్నా కూడా ఎవరూ కూడా పార్టీని పటిష్టం చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. ఎవరైనా చొరవ తీసుకొని బహిరంగ సభ ఏర్పాటు చేస్తే వచ్చి హాజరు వేయించుకొని వెళ్ళిపోతున్నారు. కేంద్రంలో, సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా చురుకుగా వ్యవహరించిన వి హనుమంత రావు, జైపాల్ రెడ్డి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, మధు యాష్కి, పొన్నం ప్రభాకర్, పొన్నాల లక్ష్మయ్య వంటి సీనియర్ కాంగ్రెస్ నేతలు చాలా మంది ఇప్పుడు కనబడటమే లేదు.

ఉత్తం కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి, భట్టి విక్రమార్క మాత్రం కనబడుతున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అంటే వారు నలుగురే అన్నట్లుంది. వారు కూడా పార్టీని ఏవిధంగా బలోపేతం చేసుకోవాలని ఆలోచించకుండా, తమ పార్టీ వాస్తవ పరిస్థితిని గుర్తించకుండా 2019 ఎన్నికల గురించి, పిసిసి అధ్యక్ష పదవి, ముఖ్యమంత్రి పదవి గురించే ఆలోచిస్తుండటం చాలా విస్మయం కలిగిస్తుంది. ఒకసారి ఇవే కారణాలతో ఎన్నికలలో అధికారం చేజార్చుకొన్నప్పటికీ కాంగ్రెస్ నేతలలో ఎటువంటి మార్పు రాకపోవడం ఆశ్చర్యమే. 


Related Post