అన్నా..దానర్ధం ఏమిటి?

March 23, 2017


img

భాజపా ఎమ్మెల్యే ఎన్.వి.వి.ఎస్. ప్రభాకర్ నిన్న శాసనసభలో మాట్లాడుతూ, “ఒకవేళ తెరాస సర్కార్ ముస్లింలకు రిజర్వేషన్లు పెంచాలని చూస్తే రాష్ట్రంలో కూడా మరొక ఆదిత్యనాథ్ యోగి ఉద్భవిస్తాడు,” అని హెచ్చరించారు. ముస్లింల సామాజిక, ఆర్ధిక స్థితిగతులను తెలుసుకొనేందుకు బిసి కమీషన్ సర్వే నిర్వహించడాన్ని తప్పుపడుతూ, “బీసిల సంక్షేమం కోసం పనిచేయవలసిన ఆ సంస్థ మైనార్టీల గురించి ఆలోచిస్తోంది. అలాగే రాష్ట్రంలో ఏసీ,ఎస్టీల సంక్షేమాన్ని కూడా తెరాస సర్కార్ పట్టించుకోవడం లేదు. తెరాస సర్కార్ కు ముస్లింల మీద ఉన్న ప్రేమ రాష్ట్రంలో మిగిలిన వర్గాల ప్రజల మీద లేదు. ఒకవేళ దానితీరు ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికలలో ప్రజలే దానికి గట్టిగా బుద్ధి చెపుతారు,” అని అన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ మాట్లాడుతూ తమ పార్టీ మతపరమైన రిజర్వేషన్లను గట్టిగా వ్యతిరేకిస్తుందని హెచ్చరించారు. 

భాజపా, మజ్లీస్ పార్టీలు మతతత్వ పార్టీలు గనుక అవి మతమే ఆధారంగా రాజకీయాలు చేస్తుంటాయి. కనుక ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని భాజపా వ్యతిరేకిస్తే ఆశ్చర్యమేమీ లేదు. ఈ అంశంపై ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలే ఆసక్తి కలిగిస్తున్నాయి. ‘యోగి వంటి వ్యక్తి తెలంగాణాలోను ఆవిర్భవిస్తాడు’ అంటే హిందూ అతివాదిగా ముద్రపడిన యోగి ముఖ్యమంత్రి కావడం చాలా అసహజం లేదా విచిత్రం అని ప్రభాకర్ భావిస్తునట్లుంది. ‘ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తే అటువంటి హిందూఅతివాది పుట్టుకొస్తాడు’ అని ప్రభాకర్ చెప్పడం చూస్తే అటువంటివారు సమాజానికి చాలా ప్రమాదం అని హెచ్చరిస్తున్నట్లుంది. అతివాదం ఏ రూపంలో ఉన్నా అది సమాజానికి ప్రమాదకరమే అని అనేకసార్లు నిరూపితం అయ్యింది. మరి ఈ సంగతి తెలిసి భాజపా యోగిని యూపి ముఖ్యమంత్రిగా ఎందుకు నియమించింది? భాజపా అధిష్టానం యోగి నియామకం సరైనదని భావిస్తున్నప్పుడు ప్రభాకర్ అటువంటి వ్యక్తి తెలంగాణాలో పుట్టుకు వస్తే ప్రమాదం అన్నట్లుగా మాట్లాడటం సరైనదేనా? 

దేశంలో ప్రజలందరూ కలిసిమెలిసి జీవిస్తున్నప్పటికీ రాజకీయ పార్టీలు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం చేసే ఇటువంటి ఓటు బ్యాంక్ రాజకీయాలతో ప్రజల మద్యన అడ్డుగోడలు కడుతుండటం చాలా శోచనీయం. 


Related Post