తెలంగాణా బడ్జెట్ సమర్పణ కార్యక్రమం ముగిసిన వెంటనే యధాప్రకారం ప్రతిపక్షాలు ఈ బడ్జెట్ లో చేసిన కేటాయింపులకు, రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులకు ఎక్కడా పొంతనలేదని, అది  ప్రజలను మభ్యపెట్టడానికే రూపొందించినట్లు ఉందని విమర్శించగా, తెరాస నేతలు సహజంగానే ఇటువంటి బడ్జెట్ ‘నభూతో నభవిష్యత్’ అన్నట్లుగా ఉందని భుజాలు చరుచుకొంటున్నారు. అధికార, ప్రతిపక్షాల ఈ ప్రతిచర్యలు చాలా సహజం సర్వసాధారణమైన విషయమే. కానీ తెరాస సర్కార్ తన బడ్జెట్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు నిర్వహించడం, ఇంత గొప్ప బడ్జెట్ అందించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుకొనేందుకు వివిధ వర్గాల ప్రజలు ప్రగతి భవన్ ముందు క్యూలు కట్టి మరీ నిలబడటం చాల అతిగా ఉందని చెప్పకతప్పదు. 
బడ్జెట్ అనేది ఒక రాష్ట్రానికి చెందిన వార్షిక పద్దు మాత్రమే. అది కూడా ఏదో ఘనకార్యమే అన్నట్లు తెరాస సర్కార్ చాటింపు వేసుకోవడం, రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ ఫోటోలకు పాలాభిషేకాలు, నీళ్ళతో అభిషేకాలు, ఊరేగింపులతో హడావుడి చేయడం చాలా విడ్డూరంగా ఉంది. ఇంతవరకు సమాజంలో నిరాధారణకు వివక్షకు గురైన వివిధ వర్గాలకు, నిర్లక్ష్యం చేయబడిన వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కేటాయింపులు జరిపితే అది తప్పకుండా హర్షించతగ్గ విషయమే. అయితే దానికి ఇంత హడావుడి అవసరమా? అసలు తెరాస సర్కార్ ఎందుకు ఇంత హడావుడి చేస్తోంది? అనే సందేహం కలుగకమానదు.
దానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్షాల విమర్శలను బలంగా త్రిప్పి కొట్టడం. ప్రొఫెసర్ కోదండరామ్ నిర్వహించిన నిరుద్యోగ ర్యాలీ కారణంగా ప్రజలలో తెరాస సర్కార్ పట్ల పెరిగిన వ్యతిరేకతను తగ్గించేందుకు. తమ ప్రభుత్వం తెలంగాణా రాష్ట్రం, ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం చాలా లోతుగా ఆలోచించి చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ప్రజలకు చాటుకోవడానికి. మరో రెండేళ్ళలో జరుగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే ప్రజలను తెరాస వైపు ఆకర్షించడానికి కావచ్చు.
ఈ బడ్జెట్ వలన సమాజంలో వివక్షకు గురైన ప్రజలకు నిజంగానే లబ్ది కలిగితే వారు నిస్సందేహంగా తెరాసకే ఓట్లు వేస్తారు తప్ప ఇన్ని దశాబ్దాలుగా తమను పట్టించుకొని పార్టీలకు వేయరని వేరే చెప్పనవసరం లేదు. అయితే తమ ప్రభుత్వం వారి కోసం చాలా చేస్తోందనే విషయాన్ని వారందరికీ గట్టిగా నొక్కి చెప్పడానికే ఈ హడావుడి చేస్తున్నట్లు భావించవచ్చు.
ఏ ప్రభుత్వ లక్ష్యమైనా రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమంగానే ఉంటుంది. కానీ ఆ ఆశయాలను ఎంతవరకు ఆచరణలో పెట్టగలిగాయి? వాటి ప్రయత్నాలు ఎంత వరకు ఫలించాయి? అనేది ప్రజలు చెప్పాలి తప్ప ప్రభుత్వాలు కాదు.