భాజపా నీతులు మాటలకేనా?

March 13, 2017


img

గోవా, మణిపూర్ రాష్ట్రాలలో జరుగుతున్న రాజకీయాలు చూస్తుంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నట్లుంది. రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ భాజపాకే గవర్నర్ నుంచి పిలుపు వచ్చింది. తమ పార్టీకే ఇతరులు మద్దతు ఇచ్చారని భాజపా చెప్పుకోవడంలో తప్పు లేదు. కానీ అతిపెద్ద పార్టీగా అవతరించిన పార్టీకే ముందుగా అవకాశం ఇవ్వడం ప్రజాస్వామ్య పద్ధతి. కేంద్రంలో భాజపాయే అధికారంలో ఉన్న కారణంగా రెండు చోట్ల గవర్నర్లు ఆ సంప్రదాయాన్ని పక్కనపెట్టి భాజపాకే అవకాశం కల్పించారు. 

ఇది అనైతికం, అప్రజాస్వామికం అని ప్రజాస్వామ్యవాదులు బాధ పడవచ్చు గాక..కానీ అధికారమే పరమావధిగా భావిస్తున్న భాజపా అవేమీ పట్టించుకొనే స్థితిలో లేదిప్పుడు. నిజానికి భాజపా యూపి, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో మాత్రమే పూర్తి మెజార్టీతో విజయం సాదించింది. గోవాలో అధికారంలో ఉన్న భాజపాకు 40 సీట్లలో కేవలం 13 సీట్లు మాత్రమే వచ్చాయంటే అర్ధం ఏమిటి? దానిని ప్రజలు తిరస్కరించారనే కదా? కానీ ఇతర పార్టీల మద్దతు కూడగట్టి, నైతిక విలువలను పక్కన పెట్టి అధికారం చేజిక్కించుకొని ‘మేమే గెలిచాం’ అని నిసిగ్గుగా గొప్పలు చెప్పుకొంటోంది. మళ్ళీ మణిపూర్ లో కూడా అదే తప్పు చేస్తోంది. 

అందుకే భాజపాకు ప్రజలన్నా వారి తీర్పు అన్నా ఏమాత్రం గౌరవం లేదని...గోవాలో ఎన్నికలను భాజపా దొంగిలించిందని మాజీ కేంద్రమంత్రి చిదంబరం విమర్శించారు. రెండవ స్థానంలో నిలిచినా భాజపా ఏవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది? అని ప్రశ్నించారు. 

నిజానికి భాజపా ఎన్నికలను దొంగిలించలేదు. కాంగ్రెస్ కు దక్కవలసిన అధికారాన్ని దొంగిలించిందని చెప్పవచ్చు. గతంలో కాంగ్రెస్ కూడా చాలా తప్పులు చేసి ఉండవచ్చు. కనుక భాజపా కూడా దిగజారదలిస్తే అప్పుడు దానికీ కాంగ్రెస్ కి మద్య తేడా ఏమీ ఉండదు. 


Related Post