నగదు ఉపసంహరణలపై ఆంక్షలను నేటి నుంచి పూర్తిగా ఎత్తివేయబోతున్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ గత నెలలో ప్రకటించారు. కనుక నేటి నుంచి బ్యాంకులు, ఎటిఎంల ద్వారా ఇదివరకులాగే నగదు తీసుకోవచ్చు. ఇప్పుడు ఆంక్షలు లేవు. అలాగే చాలా బ్యాంకులు, ఎటిఎంలలో నగదు లేదు. ఈ కారణంగా దేశంలో మళ్ళీ చాలా చోట్ల ఎటిఎంలలో ‘నో’క్యాష్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. 
కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకు ప్రజలను బలవంతంనైనా నగదు రహిత లావాదేవీలవైపు నడిపించే ప్రయత్నంలో భాగంగానే బ్యాంకులు ఈ కృత్రిమ నగదు కొరతను సృష్టిస్తున్నాయని ప్రజలలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై బ్యాంకులు ఇస్తున్న వివరణ కూడా ఆ అనుమానాలను బలపరుస్తోంది. రిజర్వ్ బ్యాంక్ నుంచి బ్యాంకులకు సరిపడినంత నగదు రావడం లేదని చెపుతున్నాయి. ఇదివరకు నోట్ల రద్దు తరువాత బ్యాంకులకు నగదు వరదలా ప్రవహించేది. కానీ ఇప్పుడు నిత్యం రావలసిన మొత్తంలో 50 శాతం కూడా రావడం లేదని బ్యాంకులు చెపుతున్నాయి.
నగదు కొరత ఏర్పడినప్పుడు నగదు రహిత లావాదేవీలు చాలా జోరుగా సాగాయి. కానీ మళ్ళీ సరిపడినన్ని నోట్లు అందుబాటులోకి వచ్చేసరికి ప్రజలు నగదుతోనే లావాదేవీలు జరుపడం మొదలుపెట్టారు. నిరక్షరాస్యత, పేదరికం ఎక్కువగా ఉన్నప్పుడు అది సహజం కూడా. పైగా నగదు రహిత లావాదేవీలు చేసిన వారికి బ్యాంకులు ప్రోత్సహకాలు ఇచ్చే బదులు వారిపై ఎడాపెడా సర్వీస్ చార్జీలు వడ్డిస్తున్నాయి. ప్రజలు నగదు రహిత లావాదేవీలకు మొగ్గు చూపకపోవడానికి ఇదీ మరొక కారణమని చెప్పవచ్చు.
ఆర్ధికశాఖ, రిజర్వ్ బ్యాంక్, బ్యాంకులు అన్నీ కలిసి రోజుకొక నిబందన, వడ్డింపులతో సామాన్య ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుండటంతో వారు కూడా తమ వద్ద ఉన్న నగదును బ్యాంకులలో జమా చేయడం తగ్గించుకొన్నారు. బ్యాంకులలో నగదు నిలువలు తగ్గడానికి ఇదీ ఒక ప్రధాన కారణమే అని చెప్పవచ్చు. కనుక ప్రభుత్వమూ, రిజర్వ్ బ్యాంక్, బ్యాంకులు చేస్తున్న వరుస తప్పులే మళ్ళీ ఈ రెండో ఆర్ధిక సంక్షోభానికి ప్రధాన కారణమని చెప్పకతప్పదు. ప్రజలను ఈవిధంగా ఒత్తిడికి గురి చేసి నగదు రహితలావాదేవీలు జరిపేలాచేయాలను కొంటే అంతకంటే అవివేకం ఉండదు. 
నోట్ల రద్దు తరువాత తీవ్ర సంక్షోభం ఎదురైనప్పుడు ఈ సమస్యలన్నీ తాత్కాలికమైనవేనని, త్వరలోనే మళ్ళీ పరిస్థితులు సాధారణస్థితికి వస్తాయని, అంతవరకు అందరూ దేశం కోసం కొద్దిగా ఓర్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీతో సహా కేంద్రమంత్రులు పదేపదే చెప్పేవారు. కానీ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తరువాత మళ్ళీ మరోసారి సంక్షోభం మొదలవడం ఖచ్చితంగా వారి తప్పే. దీనికి వారే బాధ్యులని చెప్పక తప్పదు.