తెలంగాణా సాధన కోసం కేసీఆర్ నాయకత్వంలో తెరాస ఏకధాటిగా 10 ఏళ్ళకు పైగా అనేక ఉద్యమాలు చేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఎవరూ దేని కోసం ఉద్యమాలు, ధర్నాలు, నిరసన ర్యాలీలు చేయకూడదని చేస్తే రాష్ట్రాభివృద్ధిని అడ్డుకొంటున్నట్లుగానేనని వాదిస్తోంది. తాజా సమాచారం ఏమిటంటే ఇకపై నగరంలోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఎవరినీ ధర్నాలు చేయడానికి అనుమతించకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎవరైనా ఏదైనా సమస్యపై ధర్నాలు చేయదలిస్తే నగర శివార్లలో పోలీస్ అధికారులు గుర్తించిన నాలుగు ప్రాంతాలలో మాత్రమే చేసుకోవచ్చు. 
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్, దుండిగల్ సమీపంలోని పోచంపల్లి గ్రామం, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని కాప్రా మండలంలోని జవహర్‌నగర్, ప్రతాప సింగారం గ్రామాలలో గుర్తించిన ప్రాంతాలలో మాత్రమే ధర్నాలు చేసుకోవచ్చు.
నగరం మద్యలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలకు అనుమతించినట్లయితే బారీగా ట్రాఫిక్ జామ్ అవుతుండటమే కాకుండా, శాంతి భద్రతల సమస్య, ధర్నా సమయాలలో లౌడ్ స్పీకర్స్ ఉపయోగిస్తుండటం వలన శబ్ద కాలుష్యం వంటి సమస్యలు తలెత్తుతుండటం వంటి కారణాల చేత ఇందిరా పార్క్ వద్ద ధర్నాలకు ఇకపై అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రభుత్వ నిర్ణయంపై సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎంపి వి హనుమంతరావు తీవ్రంగా స్పందించారు. “కేసీఆర్ చాలా నియంతృత్వ పోకడలు పోతున్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రతిపక్షాలు, వివిధ ఉద్యోగ సంఘాలు ఇందిరా పార్క్ లో ధర్నాలు చేసుకొంటారు. వారి గొంతులను కేసీఆర్ అణచివేయాలని చూస్తున్నారు. ఇందిరా పార్క్ నుంచి ధర్నాచౌక్ ను వేరే చోటికి తరలిస్తే మేము చూస్తూ ఊరుకోము,” అని హెచ్చరించారు.
సి.ఐ.టి.యు. కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. దాని రాష్ట్ర అధ్యక్షుడు రాములు, ప్రధాన కార్యదర్శి సాయిబాబు ఒక మీడియా ప్రకటనలో, “ఉద్యమాల ద్వారా తెలంగాణా సాధించిన కేసీఆర్ ఇప్పుడు ఉద్యమాలను చూసి భయపడుతుండటం, ఉద్యమాలను అణగద్రొక్కేయాలని ప్రయత్నిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయనలో క్రమంగా అసహనం, నిరంకుశత్వం పెరిగిపోతోంది. అందుకు ఇదే తాజా ఉదాహరణ. ప్రభుత్వ నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము,” అని పేర్కొన్నారు.