అయితే క్యాన్సిల్...పేటిఎం

March 10, 2017


img

నోట్ల రద్దు తరువాత దేశంలో సామాన్య ప్రజలు ఎవరైనా లాభాపడ్డారో లేదో తెలియదు కానీ పేటిఎం సంస్థ మాత్రం దాని పూర్తి ఫలాలు పొందిందని చెప్పక తప్పదు. డిల్లీ కేంద్రంగా 2010 లోనే స్థాపించబడిన ఈ సంస్థ గురించి నోట్ల రద్దు వరకు దేశంలో చాలా మందికి తెలియదు. ఉత్తరాది రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలో ప్రజలు మాత్రమే దాని సేవలను ఎక్కువగా ఉపయోగించుకొంటున్నారు. కానీ మోడీ పుణ్యమాని నోట్ల రద్దు తరువాత యావత్ దేశంలో పేటిఎం సంస్థ పేరు మారుమ్రోగిపోతోంది. ఇప్పుడు చేపల బజారులో కూడా “ఇక్కడ పేటిఎం ద్వారా నగదు స్వీకరించబడును” అనే బోర్డులు దర్శనమిస్తున్నాయంటే ఆ సంస్థ మూడు నెలల వ్యవధిలోనే ఎంతగా పాతుకుపోయిందో అర్ధం చేసుకోవచ్చు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చాలా హడావుడిగా అనేక ‘మొబైల్ యాప్’ లు ప్రవేశపెట్టినా వాటికి ప్రజల ఆదరణ పొందలేకపోయాయి. కానీ  పేటిఎం మాత్రం దూసుకుపోతోంది! 

ఇప్పుడు దేశవ్యాప్తంగా పేటిఎంకు చాలా ఆదరణ, డిమాండ్ పెరిగినందున ‘డిమాండ్ అండ్ సప్లై’ ఆనవాయితీ ప్రకారం అది తన వినియోగదారులకు అప్పుడే వాతలు పెట్టడం మొదలుపెట్టింది. క్రెడిట్ కార్డు ద్వారా పేటిఎం వాలెట్ను రీచార్జ్ చేసుకుంటే, దానిపై 2 శాతం చార్జీ వ‌సూలుచేయబోతున్నట్లు ప్రకటించింది. దానిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో కేవలం 4 గంటల వ్యవధిలోనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకొంటున్నట్లు ప్రకటించింది. 

తమ సంస్థను ఇంతగా ఆదరిస్తున్న తన వినియోగదారులకు కృతజ్ఞతగా ఏవైనా ప్రోత్సాహకాలు ఇవ్వకపోగా, వారు తమ సంస్థను మోసం చేస్తున్నారని ఆరోపించడం చాలా శోచనీయం. కొంతమంది వినియోగదారులు తమ క్రెడిట్ కార్డులను ఉపయోగించి పేటిఎం వ్యాలెట్ ను రీ–చార్జ్ చేసుకొని, మళ్ళీ దానిలో జమా అయిన నగదును తమ బ్యాంక్ ఖాతాలలోకి మళ్ళించుకొంటున్నారని పేటిఎం ఆరోపించింది. తద్వారా తమ సంస్థకు చాలా నష్టాలు వస్తున్నాయని, ఈ దుర్వినియోగాన్ని అడ్డుకోనేందుకే 2 శాతం చార్జీ వ‌సూలుచేయాలనుకొన్నామని, కానీ దాని వలన నిజాయితీగా రీ-చార్జ్ చేసుకొంటున్న వినియోగదారులపై అదనపు భారం మోపినట్లు అవుతోందని గ్రహించినందునే తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకొన్నామని పేటిఎం ప్రకటించింది. అయితే ఇటువంటి మోసాలను అరికట్టడానికి ప్రత్యామ్నాయ మార్గాలు వెదుకుతున్నామని పేటిఎం తెలిపింది. 

నానాటికీ వినియోగదారులు పెరుగుతుంటే వారిని కాపాడుకొనేందుకు ప్రయత్నించకుండా, ఎవరో కొందరు మోసాలకు పాల్పడితే అందరినీ శిక్షించాలని పేటిఎం యాజమాన్యం అనుకోవడం చాలా అవివేకమే. ఆ భారాన్ని భరించడానికి ఇష్టపడని వినియోగదారులు పేటిఎంను పక్కన పడేస్తే అదే నష్టపోతుంది తప్ప వారు కాదనే సంగతి అది గ్రహించబట్టే వెంటనే తన నిర్ణయం ఉపసంహరించుకొన్నట్లుంది. నేటికీ సామాన్య ప్రజలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని బ్యాంకులు, ముఖ్యంగా స్టేట్ బ్యాంకుకు కూడా ప్రజలు ఇటువంటి గుణపాఠమే నేర్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది.  


Related Post