రాష్ట్ర విభజనపై బాబు మొసలి కన్నీళ్ళు

March 03, 2017


img

వెలగపూడిలో ఏపి అసెంబ్లీ ప్రారంభోత్సవ సందర్భంగా సి.ఎం. చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన చాలా బాధాకరమని, ఏపికి జరిగిన అవమానం, అన్యాయం తనను చాలా కలచివేశాయని అన్నారు. అనేక దశాబ్దాలుగా కలిసున్న రాష్ట్రం విడిపోతునందుకు ఏపి ప్రజలు, నేతలు బాధపడిన మాట వాస్తవం. కానీ ఆ విభజనకు చంద్రబాబుతో సహా అన్ని పార్టీల నేతలు లిఖితపూర్వకంగా అంగీకార పత్రాలు ఇ్చిచ్చారు. ఇప్పుడు ఆ సంగతి మరిచిపోయినట్లు మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది.

స్వయంగా విభజనకు అంగీకరించి, అది అనివార్యమని తెలిసిన తరువాత కూడా రాష్ట్రానికి రావలసిన వాటిని సాధించుకొనే ప్రయత్నం చేయకుండా ఇప్పుడు రాష్ట్రానికి అన్యాయం జరిగిపోయిందని మొసలి కన్నీళ్ళు కార్చుతున్నారు. అప్పుడు రాష్ట్రానికి రావలసిన వాటి గురించి కేంద్రాన్ని అడిగితే, ఆయన రాష్ట్ర విభజన కోరుకొంటున్నారని జగన్ ప్రచారం చేస్తే తెదేపాకు రాజకీయంగా నష్టం కలుగుతుందనే భయంతోనే అప్పుడు బాబు మౌనం వహించారు. అంటే అప్పుడు కూడా ఆయన పార్టీ ప్రయోజనాలే చూసుకొన్నారని స్పష్టం అవుతోంది.

యూపియే ప్రభుత్వం విభజనపై తుది నిర్ణయం తీసుకొంటున్నప్పుడు తెలంగాణాలో తెదేపాను విభజనకు అనుకూలంగా, ఏపిలో తెదేపాను విభజనకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయనిచ్చారు. ఏమంటే రెండు కళ్ళ సిద్దాంతం చెప్పారు. నిజానికి ఆయన విభజనకు అంగీకరించారని చెప్పడానికి ఆ సిద్దాంతామే ఒక ఉదాహరణ.

నిజానికి ఆ సమయంలో చంద్రబాబుకు తన నాయకత్వ లక్షణాలు నిరూపించుకొనేందుకు ఒక గొప్ప అవకాశం వచ్చిందని చెప్పవచ్చు. ఆ సమయంలో ఆయన ధైర్యంగా రాష్ట్ర ప్రజల ముందుకు వచ్చి, రాష్ట్ర విభజన అనివార్యమని, కనుక ఆంధ్రాకు న్యాయంగా రావాలసిన వాటి కోసం అందరం కలిసి కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెద్దామని చెప్పగలిగి ఉండి ఉంటే రెండు రాష్ట్రాలకు ఇంకా ఎక్కువ మేలు కలిగేది. ఏపికి ప్రత్యేక హోదా అంశం అప్పుడే విభజన బిల్లులో చేర్చబడి ఉండేది. నేడు దాని కోసం ఎవరూ పోరాటాలు చేయవలసి వచ్చేది కాదు.

అప్పుడే చంద్రబాబు విభజన అనివార్యమని, దానిని అందరూ అంగీకరిద్దామని ఏపి ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసి ఉండి ఉంటే తెలంగాణా ప్రజలకు కూడా ఆయన పట్ల గౌరవం పెరిగి ఉండేది. కానీ అప్పుడు రెండు ప్రాంతాలలో తన పార్టీ రాజకీయ ప్రయోజనాలే చూసుకొన్నారు. లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ ఒక్కరే ధైర్యంగా రాష్ట్ర విభజన అనివార్యమని ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు కానీ అందరూ కలిసి అయన గొంతు వినపడకుండా నొక్కేశారు.  

ఎన్నికల ప్రక్రియ మొదలవగానే తెదేపా, వైకాపాలు రాష్ట్ర విభజన గురించి మాట్లాడటం మానేసి వేరే ఇతర అంశాల గురించి మాట్లాడటం గమనిస్తే వాటి చిత్తశుద్ధి ఏపాటిదో అప్పుడే అర్ధం అయ్యింది. అప్పుడు రాష్ట్ర విభజన విషయంలో ప్రజలను మభ్యపెట్టినట్లుగానే ఆ తరువాత ఏపికి ప్రత్యేక హోదా విషయంలో కూడా అన్ని పార్టీలు మభ్యపెట్టాయి. ఇంకా మభ్యపెడుతూనే ఉన్నాయి.


Related Post