రసమయి రచ్చ..కలెక్టర్ పరేషాన్!

March 03, 2017


img

కరీంనగర్ లో మొన్న బుధవారం జరిగిన డిజి ధన్ మేళా కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బ్యానర్ లో తెరాస ఎంపి ఎంపి బి వినోద్ కుమార్ ఫోటో లేకపోవడంతో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ జిల్లా కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ పై బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేయడం, అందుకు మంత్రి ఈటెల క్షమాపణ చెప్పడం తెలిసిందే. 

అధికార పార్టీకే చెందిన ఒక ఎమ్మెల్యే తమ ప్రభుత్వంలో భాగమైన ఒక జిల్లా కలెక్టర్ తో అనుచితంగా ప్రవర్తించినందుకు సామాన్య ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడితో ఈ వివాదం సమసిపోయినా బాగుండేది. కానీ రసమయి బాలకిషన్ కు మద్దతుగా దళిత, కళాకారుల సంఘాలు నిన్న జిల్లా వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించడంతో, జిల్లాలోని ప్రభుత్వోద్యోగులు, ఉన్నతాధికారులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ కు మద్దతుగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలిపారు. 

తనను కలిసేందుకు వచ్చిన ఉద్యోగులకు ఆయన చేతులు జోడించి నమస్కరించి “దయచేసి ఈ వివాదాన్ని ఇంకా పెద్దది చేయవద్దు. ఇక్కడితో వదిలేద్దాం. ఉద్యోగులు అందరూ సంయమనం పాటించాలి,” అని అభ్యర్ధించడంతో వారు అందుకు అంగీకరించి తమ నిరసనను విరమించుకొన్నారు.  

ఒక చిన్న సమస్యను పట్టుకొని అధికార పార్టీ ఎమ్మెల్యేయే ఈవిధంగా రాద్దాంతం చేస్తే, దాని వలన తమ ప్రభుత్వం ప్రతిష్టే దెబ్బ తింటుందని గ్రహించి ఉండి ఉంటే కధ ఇంతవరకు వచ్చేదే కాదు. ఈ ప్రోటో కాల్ వివాదం గురించి రసమయి నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ కే పిర్యాదు చేసి ఉండి ఉంటే, ఆయన ఎవరి గౌరవానికి భంగం కలుగకుండా ఈ సమస్యను పరిష్కరించి ఉండేవారు కదా! 

రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు మోగుతాయి. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ చాలా సంయమనంతో వ్యవహరిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. కనుక రసమయి బాలకిషన్ కూడా ఇక వెనక్కి తగ్గడం అందరికీ మంచిది. 


Related Post