“మీలో మీరు కొట్లాడుకోవడం కాదు..తెరాస సర్కార్ తో కొట్లాడండి..మోడీ సర్కార్ తో కొట్లాడండి..మనలో మనమే కొట్లాడుకొంటుంటే ఇంక మన పార్టీ తెలంగాణాలో అధికారంలోకి ఎలా రాగలదు? కనుక ఈ కొట్లాటలు మానుకొని అందరూ కలిసి పనిచేయండి. వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో మన పార్టీ జెండాయే ఎగరాలి.” 
ఖమ్మం జిల్లా కూసుమంచిలో నిన్న కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జన అవేదన సభలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తన ముందే కీచులాడుకొంటున్న ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ వర్గం, ఎంపి రేణుకా చౌదరి వర్గానికి చెప్పిన మాటలివి. వారి కీచులాటలతో అది కాంగ్రెస్ ఆవేదన సభగా మారింది.
పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడటం మొదలుపెట్టగానే రేణుకా చౌదరి వర్గానికి చెందిన కొందరు పెద్దగా అరుపులు, కేకలతో గోల చేశారు. దానితో ఇరు వర్గాల మద్య వాగ్వాదాలు మొదలైయ్యాయి. పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క తదితరులు వారిని శాంతపరిచేందుకు చాలా శ్రమపడవలసి వచ్చింది.
దిగ్విజయ్ సింగ్, కుంతియాలకు వాస్తవ పరిస్థితి ఏమిటో బాగా అర్ధమయ్యే ఉంటుంది. ప్రతీ జిల్లాలో పార్టీ నేతల మద్య ఇన్ని విభేదాలు ఉన్నప్పుడు, వారందరూ కలిసి తెరాస సర్కార్ తో ఏవిధంగా పోరాడగలరు? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఏవిధంగా రాగలదు?అని వారు కూడా ఆలోచించేలా చేశారు రాష్ట్ర నేతలు. కనుక తెరాస సర్కార్ పై పోరాడటం కంటే ముందు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఈ అంతర్యుద్దాలను నియంత్రించుకోవడం అత్యవసరంగా కనబడుతోంది.