రెండు రోజుల క్రితం కృష్ణా జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై తెదేపా, వైకాపాలు రెండూ నిసిగ్గుగా పోరాడుకోవడం చూసి ప్రజలు కూడా అసహ్యించుకొంటున్నారు. ఆ బస్సు తెదేపా నేతలు జేసి దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి సోదరులకు చెందినది కావడమే వారి యుద్దానికి మూలకారణంగా కనిపిస్తోంది. 
వారిని కాపాడాలని తెదేపా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైకాపా ఆరోపిస్తుంటే, వైద్యులు, పోలీసులు, జిల్లా కలెక్టర్ తో జగన్ చాలా అనుచితంగా వ్యవహరించారని, శవరాజకీయాలు చేస్తున్నారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.
వాస్తవానికి బాధితులను, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడాలి. ప్రమాదానికి కారణాలు కనుగొని దోషులని చట్టం ముందు నిలబెట్టాలి. నిబందనలు పాటించని బస్సు యాజమాన్యంపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. వారి నుంచి బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇప్పించాలి. మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరుగకుండా అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి.
కానీ ఇవేమీ చేయకుండా జగన్, వైకాపా నేతలపై కేసులు బనాయించి, ఈ సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్ళించాలని తెదేపా ప్రభుత్వం చూస్తోందని, జేసి బ్రదర్స్ పై ఈగ వాలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటోందని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ దురుసుతనం గురించి తీవ్ర విమర్శలు చేస్తున్న తెదేపా నేతలకు జవాబుగా చంద్రబాబు నాయుడు ఎప్పుడెప్పుడు, ఎవరెవరితో అనుచితంగా ప్రవర్తించారనే పెద్ద జాబితాను సాక్షిలో ప్రచురించింది. అంటే చంద్రబాబు చేయగా లేనిదీ జగన్ చేస్తే తప్పా? అని ప్రశ్నిస్తునట్లుంది.
ఈ ప్రమాదంలో చనిపోయిన, గాయపడినవారి గురించి రెండూ పార్టీలు ఆలోచించ కుండా ఒకదానిపై మరొకటి బురద జల్లుకోవడంపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తుండటం చాలా విచారకరం.