తెలంగాణా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తమ తమ నియోజకవర్గాలలో అభివృద్ధి పనులు చేపట్టడానికి వీలుగా ఒక్కొక్కరికీ రూ.1.5 కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ ఇచ్చారు. దానిని నిలబెట్టుకొంటూ తెరాస సర్కార్ ఈరోజు మొదటి విడతగా రూ. 210 కోట్లు విడుదల చేసింది. 
తెరాస సర్కార్ తన హామీని నిలబెట్టుకొనందుకు అభినందించవలసిందే. కానీ ఆ నిధులను ప్రజా ప్రతినిధులు అందరూ సక్రమంగా ఉపయోగించేట్లు చూడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉంది. లేకుంటే ప్రజాధనాన్ని వారికి ఊరికే పంచిపెట్టినట్లు అవుతుంది. పార్టీలకు రాజకీయ విభేదాలకు అతీతంగా అన్ని పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వం ఈ నిధులు సమానంగా అందిస్తోంది కనుక వారు కూడా అంతే బాధ్యతగా వాటితో తమ తమ నియోజకవర్గాలను అన్నివిధాల అభివృద్ధి చేసుకొనేందుకు వాటిని ఉపయోగించాలి. ముఖ్యంగా తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇది ఒక సువర్ణావకాశం. ఈ నిధులతో తమ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకొన్నట్లయితే, ప్రజలలో వారికీ, తెరాసకు ప్రభుత్వానికి కూడా చాలా మంచి పేరు వస్తుంది. అది వచ్చే ఎన్నికలలో వారికి చాలా మేలు కలిగించవచ్చు. కనుక ప్రభుత్వం అందిస్తున్న ఈ నిధులతో అందరూ తమ తమ నియోజకవర్గాలలో చిరకాలంగా పేరుకుపోయిన సమస్యల పరిష్కరించి, అభివృద్ధి కార్యక్రమాలు చెప్పట్టడం మంచిది.