తమిళనాడులో తలెత్తిన రాజకీయ సంక్షోభం పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో పూర్తిగా సమసిపోయినట్లు పైకి కనిపిస్తున్నప్పటికీ లోలోన నిప్పు రగులుతూనే ఉంది. శశికళ జైలుకు వెళ్ళే ముందు పళనిస్వామిని ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ, అతనికే పార్టీ పగ్గాలు అప్పగించకుండా తన మేనల్లుడు దినకరన్ కు అప్పజెప్పారు. ఒకవేళ పళనిస్వామి తనకు ఎదురు తిరిగితే పార్టీపై, ప్రభుత్వంపై తన పట్టు కోల్పోకూడదనే ఉద్దేశ్యంతోనే ఆమె ఆ విధంగా చేసి ఉండవచ్చు. 
ఆమె ఊహించినట్లుగానే పళనిస్వామి ఇంతవరకు ఒక్కసారి కూడా జైలుకు వచ్చి ఆమెను పరామర్శించలేదు. పైగా దినకర్ ద్వారా ఆమె సూచించిన అధికారుల బదిలీకి కూడా అంగీకరించలేదు. ప్రభుత్వంపై పట్టు సాధించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ విషయం కనిపెట్టిన దినకరన్ జైల్లో ఉన్న శశికళ చెవిలో వేస్తుండటంతో ఆమె పార్టీ నేతలకు, ప్రభుత్వంలో ఉన్నతాధికారులకు అతని ద్వారానే ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు మంత్రులు, అధికారులు బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం మొదలుపెట్టారు. కనుక తమిళనాడులో ప్రస్తుతం రెండు సమాంతర ప్రభుత్వాలు నడుస్తున్నట్లు చెప్పవచ్చు.
ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ, “తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వం చెన్నై నుంచి నడుస్తోందో లేకపోతే పరప్పన అగ్రహార జైలు నుంచి నడుస్తోందో అర్ధం కావడం లేదు. రాష్ట్రంలో అనేక సమస్యలు పేరుకొనిపోతుంటే, మంత్రులు అధికారులు అందరూ చిన్నమ్మ జపం చేస్తూ జైలు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుండటం సిగ్గు చేటు. మరి ముఖ్యమంత్రి పళనిస్వామి ఏమి చేస్తున్నారో?” అని విమర్శించారు.