కోదండరామ్ పై పిట్టల విమర్శలు

March 01, 2017


img

టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ వైఖరితో విభేదించి జెఎసి నుంచి బయటకు వచ్చేసిన పిట్టల రవీందర్ ఈరోజు కోదండరామ్ కు ఒక లేఖ వ్రాశారు. “మీరు జెఎసి సభ్యులందరితో చర్చించి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకొని ఉంటే బాగుండేది కానీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటూ వాటినే జెఎసి నిర్ణయాలుగా చెప్పడం సరికాదు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా నడుస్తున్న జెఎసికి మీరు చైర్మన్ గా ఉంటూ మళ్ళీ రాజకీయ పార్టీ పెడతానని చెప్పడం సరికాదు. మీరు తెలంగాణా సాధన కోసం చాలా పోరాడానని చెప్పుకొంటున్నారు. కానీ తెలంగాణా ఉద్యమాలలో మీరు చేసింది ఏమిటో చెప్పగలరా?” అని పిట్టల రవీందర్ తన లేఖలో ప్రొఫెసర్ కోదండరామ్ ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ప్రొఫెసర్ కోదండరామ్ పై విభేదిస్తే జెఎసి నుంచి ఎవరూ బయటకు వెళ్ళిపోనవసరం లేదు. దానిలో సభ్యులుగా ఉన్నవారు చాలా విషయాలపై లోతుగా చర్చించుకొంటున్నప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. కానీ అంతమాత్రన్న ఎవరూ జెఎసిని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. కానీ పిట్టల రవీందర్ బయటకు వెళ్ళిపోయి మళ్ళీ ప్రొఫెసర్ కోదండరామ్ పై ఈవిధంగా విమర్శలు చేయడం చూస్తుంటే ఆయనకు రాజకీయ ఆలోచనలు ఏవో ఉన్నట్లుగానే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే జెఎసి నుంచి తెగతెంపులు చేసుకొని పోయిన తరువాత ప్రొఫెసర్ కోదండరామ్ ను విమర్శించనవసరమే లేదు. కానీ విమర్శిస్తున్నారంటే ఆయన తెరాసకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. ఇన్నేళ్ళు ప్రొఫెసర్ కోదండరామ్ తో కలిసి పనిచేసి ఇప్పుడు తెలంగాణా సాధన కోసం మీరేమి చేశారు? అని ప్రశ్నించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ విమర్శల లక్ష్యం తెరాసవైపు నడవడమే కావచ్చు. త్వరలోనే ఆ సంగతి తెలిసిపోవచ్చు.  


Related Post