ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని దేశంలోకెల్లా అత్యంత సారవంతమైన, మంచి నీటిసౌకర్యం అందుబాటులో ఉండి ఏడాదికి మూడు పంటలు పండే పంట భూములపై నిర్మించడాన్ని రాష్ట్రంలోని ప్రతిపక్షాలతో సహా చాలా మంది ప్రజలు కూడా తప్పు పడుతున్నారు. కానీ నది ఒడ్డునే రాజధాని నిర్మించాలని చాలా ముచ్చటపడుతున్న ఏపి సిఎం చంద్రబాబు నాయుడు, అక్కడైతేనే రాష్ట్రంలో అన్ని జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉంటుందని వితండవాదం చేస్తుంటారు. అక్కడ రాజధాని కట్టడం సరికాదని చెప్పిన జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్రాభివృద్ధిని అడ్డుకొంటున్న ద్రోహి అనే ముద్రవేసి నోరు మూయించారు. 
రాజధాని ప్రాంతంలోని గ్రామాల మద్య నుంచి ప్రవహించే కొండవీటివాగు ప్రతీ ఏటా వర్షాకాలంలో పొర్లిపొంగి అక్కడి పంట పొలాలను ముంచెత్తిస్తుంటుందని, కనుక అక్కడ రాజధాని నిర్మించడం సరికాదని జగన్మోహన్ రెడ్డితో సహా స్థానిక గ్రామస్తులు కూడా హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా చంద్రబాబు ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
వారి హెచ్చరికలను చంద్రబాబు పట్టించుకోనట్లుగా వ్యవహరించినప్పటికీ ఆయన వాటిని తేలికగా తీసుకోలేదని నిరూపిస్తున్నట్లు ఈరోజు గుంటూరు జిల్లా సీతానగరం వద్ద కొండవీటివాగు ఎత్తిపోతల పధకాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ఎత్తిపోతల పధకం ద్వారా కొండవీటివాగు వరద ముంపు సమస్య శాస్వితంగా పరిష్కారం అయిపోతుందని చంద్రబాబు నాయుడు అన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి, స్థానికులు చేసిన హెచ్చరికలు నిజమని స్వయంగా అంగీకరించినట్లు స్పష్టమయ్యింది.
అయితే ఈ సమస్యను అధిగమించడానికి ఎత్తిపోతల పధకం చేపట్టడం కూడా తప్పేనని చెప్పవచ్చు. ఎందుకంటే సాధారణంగా ఏ ఎత్తిపోతల పధకమైనా ప్రభుత్వాలకు ఆర్ధికంగా భారమైనవే కనుక.
ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు ఒక తప్పుని సరిదిద్దుకొనే ప్రయత్నం చేయకుండా ఇంకా వరుసగా తప్పులు చేసుకొంటూ వెళుతున్నట్లు కనిపిస్తుంది. కానీ ఎవరూ ఆయనను ఆపలేకపోతున్నారు. ఈ నిర్ణయం రాష్ట్రానికి మేలే చేస్తుందో తీరని నష్టమే చేస్తుందో కాలమే చెపుతుంది.