విజయ్ మాల్యా, సుజనా చౌదరి, గంటా శ్రీనివాసరావు, కావూరి సాంభశివరావు ఇంకా అనేకమంది బడా పారిశ్రామికవేత్తలు బ్యాంకుల నుంచి వేలకోట్లు రుణాలు తీసుకొని ఎగవేస్తున్నట్లు మీడియాలో తరచూ వార్తలు వస్తూనే ఉంటాయి. కానీ వారెవరి వద్ద నుంచి ఆ బాకీలు వసూలు చేసుకొన్నట్లు కానీ, బ్యాంకులను మోసం చేసినందుకు వారికి శిక్షలు పడినట్లు గానీ వార్తలు కనబడవు. అందుకు కారణం వారందరూ చాలా రాజకీయ పరపతి ఉన్నవారు కావడమే. 
అటువంటి వారి మోసాల వలన బ్యాంకులు మునిగిపోతున్నాయని కనుక వారి వద్ద నుంచి వడ్డీలతో సహా బాకీలు రాబట్టాలని కోరుతూ ఈరోజు దేశవ్యాప్తంగా 10 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులు, అధికారులు సమ్మె చేస్తుండటం విశేషం. వారికి ఇంకా అనేక డిమాండ్లు ఉండి ఉండవచ్చు కానీ వాటిలో ఇది కూడా ఒకటి కావడమే విశేషం. దీనిని బట్టి మన బ్యాంకింగ్ వ్యవస్థ ఎంత దోపిడీకి గురవుతోందో..అందుకు బ్యాంక్ ఉద్యోగులు, అధికారులు కూడా మన ప్రభుత్వాలపై..వాటిని నడిపిస్తున్న రాజకీయ నేతలపై ఎంత ఆగ్రహంగా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు.
నేతలు బడా పారిశ్రామికవేత్తల నుంచి బాకీలను వసూలు చేసుకోలేక వాటిని మొండి బకాయిల పద్దులో వ్రాసుకొని రద్దు చేసేస్తుండటం వలన బ్యాంకులు తీవ్రంగా నష్టపోతున్నాయని ఇప్పుడు బ్యాంక్ ఉద్యోగులే చెపుతున్నారు. కానీ ప్రభుత్వం వాటిని వసూలు చేసే ప్రయత్నాలు చేయకపోగా బహుశః ఆ నష్టాల ఊబిలో నుంచి బయటపడటానికే స్టేట్ బ్యాంక్ లో వివిద బ్యాంకులను విలీనం చేస్తున్నట్లు అనుమానించవలసి వస్తోంది.
బ్యాంకింగ్ వ్యవస్థలను దెబ్బతీసే (అటువంటి) సంస్కరణలను, ఆలోచనలను మానుకోవాలనేది ఉద్యోగుల మరొక డిమాండ్. వారేమీ తమ జీతాలు పెంచమని డిమాండ్ చేయడం లేదు. నోట్ల రద్దు వంటి పెను సంక్షోభాన్ని సైతం తట్టుకొని నిలబడగలిగిన మన బలమైన బ్యాంకింగ్ వ్యవస్థను సంస్కరణల పేరిట బలహీనపరచవద్దని కోరుతున్నారు. నోట్ల రద్దు సమయంలో ప్రభుత్వానికి కొండంత అండగా నిలబడి రేయింబవళ్ళు కష్టపడిన తమకు న్యాయంగా చెల్లించవలసిన కొద్దిపాటి మొత్తాలను చెల్లించమని కోరుతున్నారు. వారివి చాలా న్యాయమైన కోరికలేనని అందరూ అంగీకరిస్తారు.
కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, వాటిని నడుపుతున్న నేతలు తాము అవినీతికి వ్యతిరేకమని ఉపన్యాసాలు దంచుతుంటారు. కానీ మరోపక్క బలమైన మన బ్యాంకింగ్ వ్యవస్థను బలహీనపరుస్తుంటారు. అందుకే తమ బ్యాంకులను కాపాడుకోవడానికి బ్యాంక్ ఉద్యోగులే సమ్మె చేయవలసి వస్తోంది. ఉద్యోగులు చేస్తున్న ఈ న్యాయమైన డిమాండ్లకు అంగీకరించి, రుణాలు ఎగవేతదారుల నుంచి వాటిని వసూలుచేయడమే కాకుండా బ్యాంకులను మోసం చేసినందుకు చట్టప్రకారం కటినంగా శిక్షించాలి. అప్పుడే మన బ్యాంకింగ్ రంగం దృడంగా నిలబడుతుంది.