ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, హైదరాబాద్, బికనీర్ అండ్ జైపూర్, ట్రావన్ కోర్ మరియు పాటియాలా బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్.బి.ఐ.) విలీనం అయిపోయి అన్నీ కలిసి ఒకే బ్యాంకుగా అవతరించబోతున్నాయి. ఈ విలీనం ద్వారా ఎస్.బి.ఐ.మరింత బలోపేతం అయ్యి లాభాల బాట పట్టవచ్చు. కానీ, ఇప్పుడు అన్ని సంస్థలు వికేంద్రీకరణ మంత్రం పటిస్తున్నప్పుడు ఇంత హటాత్తుగా 5 బ్యాంకులను ఎస్.బి.ఐ. విలీనం చేయవలసిన అవసరమేమొచ్చింది? దాని వలన బ్యాంక్ నిర్వహణ ఇంకా క్లిష్టంగా, బారంగా మారే అవకాశాలున్నాయి కదా? అనే అనుమానాలు కలగడం సహజం. ఈ ప్రశ్నలకు బ్యాంకింగ్, ఆర్ధిక నిపుణులే సరైన సమాధానాలు చెప్పగలరు. ఎస్.బి.ఐ.ని ఇంకా బలోపేతం చేయడానికే ఈ  విలీనం జరుగుతున్నట్లు కేంద్రప్రభుత్వం, ఎస్.బి.ఐ. చెప్పుకొంటున్నాయి. కానీ వేరే కారణాలు కూడా కనబడుతున్నాయి.   
ఎస్.బి.ఐ. నేతృత్వంలో గల 17 బ్యాంకులకు విజయ్ మాల్యా రూ.9,000 కోట్లు బాకీలు ఎగవేసి లండన్ పారిపోయాడు. అప్పుడు బ్యాంకులు అతని ఆస్తులను జప్తు చేసి ఆ బాకీలను వసూలు చేసుకొనే ప్రయత్నం చేయకపోగా అతనికి చెందిన సుమారు రూ.1,100 కోట్ల రుణాన్ని మొండి బకాయిలుగా పేర్కొని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇది చాలా సిగ్గుచేటు.
అయితే, దేశంలో విజయ్ మాల్యా ఒక్కడే బ్యాంకులకు బాకీలు ఎగవేశాడని అనుకోవడానికి లేదు. అంబానీ సోదరులతో సహా అనేక వందలమంది బడా పారిశ్రామికవేత్తలు బ్యాంకుల దగ్గర నుంచి లక్షల కోట్లు రుణాలు తీసుకొన్నారు. వారందరికీ ప్రభుత్వంలో చాలా పలుకుబడి ఉంది కనుక ఆ స్థాయిలో రుణాలు పొందగలిగారని వేరే చెప్పనవసరం లేదు. పారిశ్రామిక అవసరాల నిమిత్తం బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవడం నేరం కాదు కానీ వాటిని వడ్డీతో సహా సకాలంలో తీర్చకపోవడమే నేరం. వారిలో ఎంతమంది బ్యాంకుల రుణాలు తీర్చారో...అసలు తీర్చే ఉద్దేశ్యం ఉందో లేదో అనే సంగతి వారికి, వారికి అప్పులిచ్చిన బ్యాంకులకే తెలియాలి.
కనుక అటువంటి బడాబాబులు చేసిన మోసాలకు బలైపోయి, మొండి బకాయిలు, నిరర్ధక ఆస్తులను పోగుబడటంతో నష్టాల ఊబిలో చిక్కుకొని దాని నుంచి బయటపడటానికే ఈ విలీనం చేస్తున్నట్లయితే ఇది ఎంతమాత్రం సమర్ధనీయం కాదు.