స్టేషన్లో కూర్చొని హీరో అయిపోయిన ప్రొఫెసర్ గారు

February 22, 2017


img

తెలంగాణాలో ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా పోరాడినా కూడా చేయలేని పనిని ప్రొఫెసర్ కోదండరామ్ ఒక్కరూ స్టేషన్లో కూర్చొనే చేసి చూపించారు ఈరోజు. ఆయన తలపెట్టిన నిరుద్యోగుల ర్యాలీ జరుగకుండా ప్రభుత్వం అడ్డుకొన్నప్పటికీ, ఆయనను విమర్శించడానికి తెరాస నేతలు పోటీలు పడటం, పోలీసుల అత్యుత్సాహం వెరసి దానిని విజయవంతం చేశారు. ఇంతవరకు ఎవరూ పట్టించుకోని ఈ ఉద్యోగాల భర్తీ అంశం ఇప్పుడు యావత్ తెలంగాణా ప్రజలలోకి బలంగా వెళ్ళిపోయింది. ఉద్యోగాల భర్తీ గురించి తెరాస నేతలు తమ ప్రభుత్వాన్ని సమర్ధించుకొంటూ ఎంత గట్టిగా వాదిస్తుంటే, ప్రజలలో అంత అపనమ్మకం ఏర్పడుతోందని చెప్పక తప్పదు. 

నిజానికి తెరాస సర్కార్ టిజెఎసిని ఈ ర్యాలీ చేసుకొనిస్తే బహుశః ఈ సమస్య ఇంతగా నలుగురి నోళ్ళలో నలిగేది కాదేమో? కనుక ఈ సమస్యను తెరాస సర్కారే స్వయంగా బాగా హైలైట్ చేసుకొందని చెప్పావచ్చు. ఈరోజు ర్యాలి నిర్వహించుకొనేందుకు అనుమతించి, దానిలో ఆయన లేవనెత్తే ప్రశ్నలకు తెరాస సర్కార్ సంతృప్తికరమైన సమాధానాలు చెప్పి ఉండాల్సింది అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం వాదిస్తున్నట్లుగా ఈ ర్యాలీ వలన శాంతిభద్రతల సమస్యలు ఏర్పడితే దానికి ఆయనే పూర్తి బాధ్యత వహించవలసి వచ్చేది కనుక అప్పుడు ప్రభుత్వం ఆయనను గట్టిగా నిలదీసి అడిగినా ఎవరూ అభ్యంతరం చెప్పేవారు కాదు. కానీ ఊహాజనితమైన కారణాలు అనుమానాలతో ఈ ర్యాలీని అడ్డుకొని ప్రభుత్వమే ప్రజల ముందు దోషిగా నిలబడింది.      తెరాస నేతలు గత కొన్ని రోజులుగా ప్రొఫెసర్ కోదండరామ్ పై మూకుమ్మడి దాడులు చేస్తున్న కారణంగా ప్రజలలో ఆయన పట్ల ఏర్పడిన సానుభూతి, ఈరోజు జరిగిన సంఘటనలతో ఇంకా పెరిగి ఉండవచ్చు. 

రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “కోదండరామ్ పార్టీ పెట్టుకోదలిస్తే నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. కానీ తెలంగాణా కోసం పోరాడిన వ్యక్తే తెలంగాణాకు వ్యతిరేకంగా కుట్రలు చేయడం చాలా బాధాకరం,” అని అన్నారు. 

ఈమాటలను బట్టి తెరాస నేతలు, మంత్రులే ప్రొఫెసర్ కోదండరామ్ చెయ్యి పట్టుకొని ప్రత్యక్ష రాజకీయాలవైపు నడిపిస్తున్నారని చెప్పవచ్చు. ఆయన తెలంగాణా కోసం పోరాడారని అంగీకరిస్తూనే మళ్ళీ ఆయన తమ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు కనుక ఆయన కుట్రలు పన్నుతున్నారు..తెలంగాణా ద్రోహి..విద్వంసం సృష్టించే తీవ్రవాది.. కాంగ్రెస్ పార్టీ ఏజంటు..అని తెరాస నేతలు చేస్తున్న ఆరోపణల వలన ప్రజలలో తెరాస సర్కార్ పట్ల వ్యతిరేకత పెరుగుతోందని గుర్తించక పోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకప్పుడు తెలంగాణా కోసం పోరాడి, ఇప్పుడు తమ కోసం పోరాడుతున్న ప్రొఫెసర్ కోదండరామ్ పట్ల ప్రజలలో సానుభూతి పెరుగుతుందని తెరాస సర్కార్ గ్రహించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏమైనప్పటికీ ప్రొఫెసర్ కోదండరామ్ గత రెండున్నరేళ్ళుగా చేసిన పోరాటాలన్నీ ఒక ఎత్తు..ఈ ఒక్క రోజు ఏమీ చేయకుండా పోలీస్ స్టేషన్లో కూర్చొని సాధించి ఒకటీ మరొక ఎత్తు అని చెప్పవచ్చు. తెరాస సర్కారే స్వయంగా ప్రొఫెసర్ కోదండరామ్ ని చాలా చక్కగా ప్రమోట్ చేస్తోందని చెప్పవచ్చు. ఇక ముందు కూడా తెరాస సర్కార్, దాని మంత్రులు, నేతలు ఆయన పట్ల ఇదేవిధంగా వ్యవహరించినట్లయితే, అదే స్వయంగా ఆయన చేతులు పట్టుకొని పార్టీ పెట్టించి, దానిని గెలిపించుకోవడం తధ్యం. 


Related Post