మొగుడిని కొట్టి బజారుకెక్కి ఏడ్చిన ఇల్లాలులాగ తమిళనాడులో డిఎంకె పార్టీ వ్యవహరిస్తోంది. శాసనసభలో పళనిస్వామి బలనిరూపణకు సిద్దపడినప్పుడు, సభలో బల్లలు ఎక్కి చొక్కాలు చించుకొని, స్పీకర్ మీదకు కుర్చీలు విసిరి నానా రభస చేసిన డిఎంకె సభ్యులు, ‘పళనిస్వామి ప్రభుత్వం చాలా అప్రజాస్వామికంగా వ్యవహరించింది’ అంటూ గవర్నర్ కు పిర్యాదు చేశారు. పోలీసుల అనుమతి తీసుకోకుండా డిఎంకె ఎమ్మెల్యేలు చెన్నై మెరీనా బీచ్ లో నిరసన దీక్ష చేశారు. పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. గురువారం డిల్లీ వెళ్ళి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పిర్యాదు చేయబోతున్నారు. 
శాసనసభలో అల్లరి చేసిందే డిఎంకె సభ్యులు. కానీ వారే ఈ హడావుడి అంతా చేస్తుండటం విశేషం. అసలు శాసనసభలో అల్లరి చేయడం ద్వారా డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఏమి ప్రయోజనం సాధించాలనుకొన్నారో అర్ధం కాదు. మళ్ళీ ఇప్పుడు చేస్తున్న పోరాటాలతో ఏమి సాధించాలనుకొంటున్నారో కూడా అర్ధం కాదు.
నిజానికి స్టాలిన్ అసమర్ధత కారణంగా ఆ పార్టీ ఒక అప్పూర్వమైన అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకొంది. శశికళ, పన్నీర్ సెల్వం వర్గాలు విడిపోయి కీచులాడుకొంటునప్పుడు, స్టాలిన్ చురుకుగా, తెలివిగా పావులు కదిపి ఉండి ఉంటే ఆయనే ముఖ్యమంత్రి అయ్యుండేవారు. కానీ ఆ అవకాశాన్ని జారవిడుచుకోవడమే కాకుండా నేటికీ ఇంకా తెలివి తక్కువగానే వ్యవహరిస్తున్నారని చెప్పక తప్పదు.
ఒకవేళ పన్నీర్ సెల్వం ఇప్పుడు పోరాడితే దానికి ఏమైనా ఒక అర్ధం, ఏదైనా ఫలితం ఉండవచ్చు కానీ స్టాలిన్ పోరాటాలకి బలమైన కారణం, సందర్భం రెండూ లేవు. కనుక ఎంత పోరాడినా సాధించేది ఏమీ ఉండదు కూడా.