ఓటుకు నోటు కేసు కదలిక దేనికి సంకేతం?

February 22, 2017


img

యావత్ దేశ ప్రజల దృష్టిని ఆకర్షించిన ఓటుకు నోటు కేసులో మళ్ళీ కదలిక వచ్చే అవకాశం ఉన్నట్లు తెరాస సర్కార్ కు అనుకూల మీడియాలో ఈరోజు ఒక వార్త వచ్చింది. దానిలో నిందితులుగా గుర్తించబడిన తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో సహా మిగిలిన నలుగురు కూడా త్వరలోనే జైలుకు వెళ్ళే అవకాశాలున్నాయని ఏసిబి అధికారులు చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొంది. 

ఆ కేసులో నిందితులను దోషులుగా నిరూపించేందుకు ఎసిబి వద్ద చాలా బలమైన సాక్షాధారాలు ఉన్నాయనే మాట వాస్తవం. కారణాలు ఏవైతేనేమి..ఆ కేసుపై తెరాస సర్కార్ ఇప్పుడు ఆసక్తి చూపడం లేదనేది కూడా బహిరంగ రహస్యమే. కానీ అకస్మాత్తుగా తెరాస అనుకూల మీడియాలో రేవంత్ రెడ్డి గురించి ఈ వార్త రావడమే చాలా ఆలోచింపజేస్తోంది. ఇది వారిపై ఒత్తిడి కలిగించడం సహజమే. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మద్య ఇప్పుడిప్పుడే మళ్ళీ సయోధ్య కుడురుతున్న వేళలో ఈ కేసులో ఎందుకు కదలిక వస్తుందని వార్త రావడానికి కారణం ఏమిటి? అని ఆలోచిస్తే బహుశః తెరాస సర్కార్ పై చెలరేగిపోతున్న రేవంత్ రెడ్డిని అదుపుచేయడానికే కావచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితమే మీడియాతో మాట్లాడుతూ “తెదేపా ఎట్టి పరిస్థితులలోను తెరాసతో చేతులు కలుపదు. తెరాసతో చేతులు కలుపడం అంటే ఉగ్రవాదులతో చేతులు కలపడమే. తెరాస సర్కార్ అప్రజాస్వామిక నిర్ణయాలు, విధానాలపై తెదేపా పోరాడుతూనే ఉంటుంది,” అని అన్నారు. 

ఈ మాటలు వింటే ఆయనను తెరాసలో చేర్చుకొనేందుకు ఏమైనా ప్రయత్నాలు జరిగాయా లేదా రాష్ట్రంలో తెదేపాను నిర్వీర్యం చేయడానికి ఆయన ఏమైనా ఒత్తిడి ఎదుర్కొంటున్నారా? అనే అనుమానాలు కలుగుతాయి. తెలంగాణాలో తెదేపా ఇంకా నిలబడి తన ఉనికిని చాటుకొంటోందంటే అది రేవంత్ రెడ్డి ఒక్కరి వలననే అని అందరికీ తెలుసు. 2019 ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ సమయం మాత్రమే మిగిలి ఉంది. కనుక ఆలోగానే తెదేపా సంగతి అంటే రేవంత్ రెడ్డి సంగతి తెరాస తేల్చుకోవలసి ఉంటుంది. కనుకనే ఈ కేసులో మళ్ళీ కదలిక మొదలవబోతోందా? అనే అనుమానం కలుగుతోంది.  


Related Post