రిజర్వ్ బ్యాంక్ త్వరలో మళ్ళీ కొత్త రూ.1000 నోట్లను ప్రవేశపెట్టబోతోందని గత రెండు మూడురోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాటిపై కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ నిన్న డిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో స్పందిస్తూ “అవన్నీ పుకార్లే. మేము అటువంటి ఆలోచన, ప్రయత్నాలు ఏమీ చేయడం లేదు. దేశంలో ఇంకా నగదు, చిల్లర కొరత నెలకొని ఉంది. దానిని అధిగమించడానికి వీలైనన్ని రూ.500 నోట్లు ముద్రించి అందించాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాము. త్వరలోనే నగదు ఉపసంహరణలపై పరిమితులు కూడా ఎత్తివేయబోతున్నాము,” అని చెప్పారు. 
రిజర్వ్ బ్యాంక్ కొత్తగా ప్రవేశపెట్టిన రూ.2,000 నోట్లలో భద్రతాపరంగా చాలా జాగ్రత్తలు తీసుకొన్నందున వాటికి నకిలీ నోట్లు తయారుచేయడం చాలా కష్టమని రిజర్వ్ బ్యాంక్ చాలా గొప్పలు చెప్పుకొన్నప్పటికీ, అప్పుడే పాకిస్తాన్ వాటికి కూడా నకిలీ నోట్లను ముద్రించి సరఫరా చేయడం మొదలుపెట్టింది. ఈ సమస్యపై కేంద్రప్రభుత్వం దృష్టి సారించవలసి ఉంది. లేకుంటే దేశంలో నకిలీ కరెన్సీ మళ్ళీ చలామణిలోకి వచ్చినట్లయితే ఉగ్రవాదులు, వేర్పాటువాదులు, మావోయిస్టులు, అసాంఘీక శక్తులు మళ్ళీ విజ్రుంభించడం ఖాయం. కనుక చివరికి ఆ ఒక్క ప్రయోజనం కూడా నెరవేరకుండా పోతుంది.