యూపిలో అధికార సమాజ్ వాదీ పార్టీలో ములాయం సింగ్, అయన కొడుకు అఖిలేష్ యాదవ్ ల మద్య జరిగిన కీచులాటలు, ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్ళించి మళ్ళీ అధికారంలోకి రావడానికే అయ్యుండవచ్చని మైతెలంగాణా.కామ్ ఊహించి చెప్పింది. ఊహించినట్లుగానే ఎన్నికలలో తండ్రీ కొడుకులు ఇద్దరూ ఏకమైపోయి తమ రాజకీయ ప్రత్యర్ధులపై కత్తులు దూస్తున్నారిప్పుడు. 
ములాయం సింగ్ కు చాలా ఆప్త మిత్రుడు, వీర విధేయుడు అని పేరొందిన అమర్ సింగ్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, “తండ్రీకొడుకులు ఇద్దరి కీచులాటలు ప్రజలను మభ్యపెట్టేందుకు ఆడిన పెద్ద డ్రామా. కాంగ్రెస్ పార్టీతో పొత్తులు వద్దని చెప్పింది ఆయనే. ఇప్పుడు ఆ పార్టీ అభ్యర్ధులకు ప్రచారం చేస్తున్నది కూడా ఆయనే. అసలు ఆయనే ఆ రెండు పార్టీల మద్య పొత్తులు కుదిర్చారు. తన కొడుకు అఖిలేష్ యాదవ్ ని మళ్ళీ ఏదో విధంగా ముఖ్యమంత్రిని చేయడం కోసమే ఆయన ఈ రసవత్తరమైన డ్రామాని నడిపించారు. జరిగిన ఈ సంఘటనలన్ననిటినీ చూసినట్లయితే ములాయం సింగ్ మంచి స్క్రిప్ట్ రైటర్ అని అర్ధం అవుతుంది,” అని అన్నారు.
ఆరోజు మైతెలంగాణా.కామ్ ఊహించిన విషయాన్నే ఇప్పుడు అమర్ సింగ్ నోట వినిపించింది. తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి యూపి ప్రజలను తమ ప్రభుత్వ పరిపాలన గురించి ఆలోచించకుండా ఉంచేందుకు బాగానే ప్రయత్నించారు. కానీ ప్రజలు ఈ విషయం గ్రహించి వారిని తిరస్కరిస్తారో లేక వారి మాయలో పడి మళ్ళీ వారికే అధికారం కట్టబెడతారో మార్చి 11న ఫలితాలు వెల్లడైనప్పుడు తెలుస్తుంది.