నేడు అంతర్జాతీయ మాతృబాషా దినోత్సవం. ప్రపంచదేశాలలో ప్రజలందరూ తమ మాతృబాషలో మాట్లాడుకోవడాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో బంగ్లాదేశ్ చేసిన ప్రతిపాదనను యునెస్కో 1999లో ఆమోదించి ఫిబ్రవరి 21వ తేదీని మాతృబాషా దినోత్సవంగా ప్రకటించింది. 
అటువంటి ప్రకటనలు ఏవీ లేకపోయినా మన దేశంలో తమిళనాడు, కేరళ, బెంగాల్, పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాలలో ప్రజలు తమ మాతృబాషను చాల అమితంగా ప్రేమిస్తూ ఆ బాషలోనే మాట్లాడేందుకే ఎక్కువ ఇష్టపడతారు. తమిళనాడులో ఆ మాతృబాషాభిమానం కొన్నిసార్లు ఇతర బాషల పట్ల దురాభిమానంగా కూడా మారుతుంటుంది. అంతగా వారు తమ మాతృబాషను ప్రేమిస్తారు.
ఇక మన తెలుగు రాష్ట్రాలలో చాలా మంది తెలుగు మాట్లాడటానికి చాలా నామోషీగా భావిస్తుంటారు. మాకు ఇంగ్లీష్ రాదని చెప్పుకొనేందుకు చాలా సిగ్గుపడే మన తెలుగువాళ్ళు, మాకు తెలుగు రాదని చాలా గర్వంగా చెప్పుకొంటుంటారు.
ఇక మన ప్రభుత్వాలకి కూడా తెలుగు బాషపై పెద్దగా ఆసక్తి లేదు. తెలుగు బాషాభివృద్ధి అంటే రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి మార్గంగానే అవి చూస్తుంటాయి. కనుకనే నేటికీ న్యాయస్థానాలలో తీర్పులు, ప్రభుత్వ ఆదేశాలు, వివిద నిర్మాణ పనులకు టెండర్లు వగైరాలన్నీ ఇంగ్లీషులోనే వెలువడుతుంటాయి. అయినా మన తెలుగు బాషతో సహా దేశంలో చాలా బాషలు నేటికీ కాపాడబడుతున్నయంటే అందుకు ప్రజలలో భాషాభిమానం ఉండటమో లేదా వాటిని కాపాడటానికి ప్రభుత్వాలు చేస్తున్న కృషో కారణం కాదు. పేదరికం కారణంగా కోట్లాదిమంది భారతీయులు కార్పోరేట్ విద్యాసంస్థలలో చేరే అవకాశం లేక ప్రభుత్వ పాఠశాలలో కాలేజీలలోనే చదువుకొంటున్నారు కనుక వారి ద్వారా మాతృబాషలు కాపాడబడుతున్నాయనేది చేదు నిజం. కానీ మన ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టే ప్రయత్నాలు ముమ్మురంగా చేస్తున్నాయి కనుక బహుశః మరికొన్ని దశాబ్దాలలోగా మన దేశంలో అనేక బాషలు వినబడకుండాపోవచ్చు.
ఈ ఇంగ్లీష్ బాష ఒత్తిడి, ప్రభావం కారణంగా చాలా మంది పిల్లలు తెలుగు బాషను నేర్చుకోలేకపోతున్నారు. అలాగని ఇంగ్లీష్ బాష మీద పూర్తి పట్టు సాధించలేకపోతున్నారు. దానితో వారు పూర్తిగా ఏ బాష రాని ఒక ‘సంకర జాతి మానవులు’గా తయారవుతున్నారు. అందుకు వారిని నిందించడం కూడా తప్పే. ఇంగ్లీషు బాషను సర్వరోగ నివారిణి అన్నట్లుగా మన ప్రభుత్వాలు, మన విద్యావ్యవస్థలు, సమాజం భావిస్తూ దానిని పిల్లలపై బలవంతంగా రుద్దుతున్న కారణంగానే వారు మాతృబాషకు దూరం అయిపోతున్నారు. కనుక మాతృబాషను కాపాడుకోవాలనే తపన తల్లితండ్రులలో, మన విద్యా సంస్థలలో, ప్రభుత్వాలకు కలిగినప్పుడే మళ్ళీ వాటికి పూర్వ వైభవం కలుగుతుంది. లేకుంటే తరాలతో బాటు మన బాషలు కూడా మెల్లగా కనుమరుగవడం తధ్యం.
రష్యా, చైనా, జపాన్, కొరియా, ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాధినేతలు తమకు ఇంగ్లీషు రాదని సిగ్గుపడకుండా ఏ దేశమేగినా...ఎందుకాలిడినా అన్నట్లుగా ఎంచక్కగా తమ మాతృబాషలలోనే ప్రసంగిస్తారు. అందుకు వారు గర్వపడతారే కానీ మనలాగ సిగ్గు పడరు. వారికి లేని సిగ్గు మనకేల? అందరూ ఓసారి ఆలోచించండి!