తమిళ సినీ పరిశ్రమకి అక్కడి రాజకీయాలకి మద్య చాలా బలమైన అనుబందమే ఉంది. స్వర్గీయ ఎం.జీ.ఆర్., స్వర్గీయ జయలలిత, కెప్టెన్ విజయ్ కాంత్ ఇలాగ చాలా మంది సినీనటులు తమిళరాజకీయాలలో కనబడతారు. రజనీకాంత్ కూడా రాజకీయాలలోకి ప్రవేశించాలని చాలా కాలంగా తహతహలాడుతున్నప్పటికీ ధైర్యం చేయలేకపోతున్నారు. జయలలిత మృతి తరువాత రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం, రాజకీయ శూన్యత కారణంగా ఆయన తప్పకుండా రాజకీయాలలోకి ప్రవేశిస్తారనే ఊహాగానాలు వినిపించాయి.  
రజనీకాంత్ ధైర్యం చేయలేకపోయినప్పటికీ ఆయనకు ఏ మాత్రం తీసిపోని గొప్ప నటుడుగా పేరొందిన కమల్ హాసన్ తీరు చూస్తుంటే ఏదో ఒకరోజు రాజకీయాలలో ప్రవేశించడం ఖాయంగానే అ(క)నిపిస్తోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్ర రాజకీయాలపై తన అభిప్రాయలు ట్విట్టర్ ద్వారా తన అభిమానులకు తెలియజేస్తూ శశికళ వర్గం పట్ల తనకున్న వ్యతిరేకతను స్పష్టంగా తెలియజేస్తున్నారు. అంతే కాదు... శశికళ విధేయుడైన పళనిస్వామి ప్రభుత్వం పట్ల కూడా వ్యతిరేకతను కనబరుస్తూ, ప్రజలను గవర్నర్ కు ఈ మెయిల్స్ ద్వారా తమ అభిప్రాయాలు తెలియజేయవలసింది కోరడం విశేషం.
కోలీవుడ్ లో చాలా మంది నటులు శశికళ వర్గాన్ని, పళనిస్వామి ముఖ్యమంత్రి కావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారిలో కమల్ హసన్ మరి కాస్త ఎక్కువగా వ్యతిరేకిస్తున్నారు. శశికళ ప్రభుత్వం పట్ల ప్రజలలో అసంతృప్తి నెలకొని ఉండటం, పన్నీర్ సెల్వం చేతికి అందివచ్చిన అవకాశాన్ని జారవిడుచుకొని ఎకాకీగా మిగిలిపోవడం, ప్రతిపక్ష డిఎంకె పార్టీ కూడా చాలా అవివేకంగా, అపరిపక్వంగా వ్యవహరిస్తుండటం, కాంగ్రెస్, భాజపాలకు రాష్ట్రంలో ఆదరణ లేకపోవడం వంటి కారణాలన్నీ కమల్ హసన్ రాజకీయ ప్రవేశానికి ఆలోచనలు, అనువైన పరిస్థితులు సృష్టించాయి.
శశికళను బెంగళూరు జైలు నుంచి చెన్నై లేదా వెల్లూరు జైలుకి మార్పించేందుకు అప్పుడే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆమె రాష్ట్రానికి తిరిగి వస్తే ఇక జైలు నుంచే రాష్ట్రాన్ని రిమోట్ పద్దతిలో పరిపాలించడం ఖాయం. అదే జరిగితే ప్రజలలో, తమిళ సినీ పరిశ్రమలో ముఖ్యంగా కమల్ హాసన్ లో కూడా ఆమె పట్ల నెలకొన్న వ్యతిరేకత ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఆ అసంతృప్తి కారణంగా ఒకవేళ ఆయన రాజకీయాలలోకి ప్రవేశించదలిస్తే లక్షలాదిమంది అభిమానులు, శశికళ ‘రిమోట్ పాలనను’ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న యావత్ తమిళచిత్ర పరిశ్రమ ఆయనకు మద్దతు ప్రకటించవచ్చు. ఒకవేళ కమల్ హాసన్ రాజకీయ ప్రవేశం చేసినట్లయితే తమిళనాడు రాజకీయాలలో మరో కొత్త శకం ఆరంభం అయినట్లే చెప్పవచ్చు.