తెలంగాణా ఏర్పడితే
లక్షల ఉద్యోగాలు వస్తాయి..నిరుద్యోగులు అందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి అని ఆశ
పడ్డారని కానీ 30 నెలలు గడిచినా కనీసం 25-30,000 ఖాళీలను కూడా భర్తీ చేయలేదని, ప్రతిపక్షాలు,
తెలంగాణా జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ 
కోదండరామ్ తదితరులు విమర్శిస్తున్నారు. ఈ నెల 22న తెలంగాణా జెఎసి అధ్వర్యంలో
హైదరాబాద్ లో బారీ నిరుద్యోగుల ర్యాలీ నిర్వహించబోతున్నారు. వారి విమర్శలకి
సమాధానంగా తెరాస సర్కార్ గత 30నెలలో ఏఏ శాఖలలో ఎన్ని ఉద్యోగాలు కల్పించిందో,
ఆశించిన స్థాయిలో ఎందుకు నియామకాలు జరుపలేకపోయిందో ప్రభుత్వ విప్ డాక్టర్ పల్లా
రాజేశ్వర్ రెడ్డి వివరించారు.
1.      
మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ప్రాజెక్టులలో 5,940 ఉద్యోగాలు 
2.     
సింగరేణిలో 5,105 
3.     
ఆర్టీసిలో 3,956 
4.     
విద్యుత్ శాఖలో 2,345
5.     
పోలీస్ శాఖలో 11,820 (ఉద్యోగల భర్తీ ప్రక్రియ మొదలైంది)
అంటే పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పిన లెక్కల ప్రకారం (పోలీస్ శాఖలో భర్తీ
ప్రక్రియ కూడా పూర్తయిందనుకొంటే) ఇంతవరకు 29,166 ఉద్యోగాల భర్తీ చేసినట్లు స్పష్టమయింది.
ఇవికాక త్వరలో విద్యుత్ శాఖలో 23,000 మందిని క్రమబద్దీకరణ చేయబడబోతున్నట్లు
చెప్పారు. కేజీ టు పీజీ పధకంలో భాగంగా రాబోయే 3 సం.లలో 24,000 ఉపాద్యాయులను
నియమించబోతున్నామని, మొదటి విడతలో 8,000 ఖాళీలు భర్తీ చేయబోతున్నట్లు తెలిపారు.
పోలీస్ శాఖలో 29,558 ఖాళీలు భర్తీ చేయబోతున్నట్లు తెలిపారు. అంటే రాగల మూడేళ్ళలో ఇవన్నీ
కూడా భర్తీ చేయగలిగినట్లయితే మరో 76,558 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లవుతుంది. కానీ ఇంకా
ఎప్పుడో జరుగబోయే భర్తీలను ఇప్పుడే ఇచ్చేసినట్లు తెరాస సర్కార్ చెప్పుకోలేదు. ఇక ప్రైవేట్
రంగంలో 43,383 మందికి ఉద్యోగాలు వచ్చినట్లు పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు. కానీ
వాటిని కూడా తెరాస సర్కార్ తన పద్దులో వ్రాసుకోవడం సరికాదనే చెప్పాలి. ప్రైవేట్ సంస్థలలో
ఉద్యోగ భద్రత ఉండదు కనుక అవన్నీ తుమ్మితే ఊడిపోయే ముక్కు వంటివే. పైగా జీతాలు కూడా
చాలా తక్కువగా ఉంటాయి. కనుక వాటిని పరిగణనలోకి తీసుకోలేము. 
ఉద్యోగుల విభజనలో కమల్ నాధన్ కమిటీ జాప్యం చేయడం, ఏపి సర్కార్ సృష్టించిన
సమస్యలు వంటి అనేక కారణాల చేత వివిదశాఖలలో ఖాళీలను గుర్తించడంలో ఒక ఏడాది ఆలస్యం
అయ్యిందని చెప్పారు. అది మాత్రం 100 శాతం నిజమనే చెప్పవచ్చు. తెరాస సర్కార్ పూర్తిగా
కుదురుకొని ఖాళీలు గుర్తించి, వాటి భర్తీకి అవసరమైన ఏర్పాట్లు చేసి, ఆ ప్రక్రియ
మొదలుపెట్టడానికి ఆ మాత్రం సమయం పట్టడం సహజమే. కానీ ఆ తరువాతైన ఖాళీల భర్తీ ప్రక్రియను
వేగవంతం చేసినట్లు కనబడదు. 
కొత్త ఉద్యోగులను తీసుకోవడం అంటే ప్రభుత్వం మీద ఆర్దికభారం పెంచుకోవడమేనని
వేరే చెప్పనవసరం లేదు. అందుకే ఉద్యోగాల భర్తీకి ఆర్ధిక శాఖ అనుమతి కూడా అవసరం
అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా లక్ష కోట్లకు పైనే బడ్జెట్ ప్రవేశపెడుతుండటం
చూస్తే ఆర్ధిక సమస్యలు లేవనే భావించవలసి ఉంటుంది. మరి ఉద్యోగాల భర్తీకి ఎందుకు వెనుకడుతున్నట్లు
అంటే ఆర్ధిక భారం నెత్తికి ఎత్తుకోవడమెందుకనే ఆలోచనతోనే అని అనుమానించవలసి
వస్తోంది.