తమిళనాట అధికార అన్నాడిఎంకె పార్టీలో ఇంతవరకు సాగిన ఆధిపత్యపోరులో రోజుకొక విచిత్రమైన పరిస్థితి కనబడింది. జయలలితకు వీరవిధేయులుగా ఉన్న పన్నీర్ సెల్వం, శశికళ ఇద్దరూ కూడా ఆమె చనిపోగానే అధికారం కోసం కుమ్ములాటలు మొదలుపెట్టేసి అమ్మ పేరుని, బొమ్మని ప్రజల మదిలో నుంచి చెరిపేసే ప్రయత్నాలు చేశారు. అమ్మకు ప్రతిరూపం తానే అన్నట్లుగా శశికళ ప్రచారం చేసుకొన్నారు. కానీ అమ్మ స్థానంలో ఆమెను ఊహించుకోవడానికి ప్రజలు ఇష్టపడని కారణంగా వారిని పన్నీర్ సెల్వం వైపు మొగ్గేలా చేసిందని చెప్పవచ్చు. కానీ శశికళ చాలా అవలీలగా పార్టీ పగ్గాలు చేజిక్కించుకోవడంతో ఇక తనకు తిరుగులేదనుకొని అదే ఊపులో ముఖ్యమంత్రి పీఠం కూడా దక్కించుకోవాలని తొందరపాటు ప్రదర్శించి చివరికి జైలు పాలయ్యారు. 
ఈ నెలరోజుల్లో ఒకసారి శశికళ, మరోసారి పన్నీర్ పైచెయ్యి సాధిస్తున్నట్లు కనబడేది. కానీ శశికళ జైలుకు పోతూ పోతూ వేసిన చివరి ఎత్తు పరిస్థితులను ఒక్కసారిగా తారుమారు చేసేసింది. గవర్నర్ పళనిస్వామినే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించబోతుండటంతో ఇప్పుడు పన్నీర్ సెల్వం వర్గంలో నిరాశ నిస్పృహలు కనబడుతున్నాయి. కనుక సెల్వానికి మద్దతు ఇస్తున్న కొద్ది మంది మళ్ళీ పళనిస్వామివైపు దూకేసే అవకాశాలే కనిపిస్తున్నాయి.
ఇంతవరకు అమ్మకు అసలైన వారసుడు, విధేయుడుగా చెప్పుకోబడిన పన్నీర్ సెల్వంపై ఇప్పుడు అధికార లాలసతో పార్టీని చీల్చడానికి కుట్రలు పన్నిన నమ్మకద్రోహి అనే ముద్ర వేసే అవకాశం కనబడుతోంది. నెలరోజులుగా సాగుతున్న ఈ రాజకీయ సంక్షోభంతో విసుగెత్తిపోయున్న తమిళ ప్రజలు, ఇప్పటికైనా దానికి ముగింపు వచ్చినందుకు పళనిస్వామినే అంగీకరించవచ్చు. కనుక పన్నీర్ సెల్వం ఇప్పుడు హటాత్తుగా ఏకాకీగా మిగిలిపోయే అవకాశం ఉంది.