సెల్వం ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరు?

February 16, 2017


img

శశికళపై అకస్మాత్తుగా తిరుగుబాటు చేసి తమిళనాడు రాజకీయాలను మలుపు తిప్పిన పన్నీర్ సెల్వం ఇంతవరకు చేసిన పోరాటాలన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. గవర్నర్ విద్యాసాగర్ రావు నిన్న సాయంత్రం పన్నీర్ సెల్వం, పళని స్వామి ఇద్దరినీ రాజ్ భవన్ కు పిలిపించుకొని మాట్లాడారు. మళ్ళీ ఈరోజు ఉదయం 11.30గంటలకు పళని స్వామిని రాజ్ భవన్ కు ఆహ్వానించడంతో ఆయనకే ముఖ్యమంత్రి అవకాశం కల్పించబోతున్నారనే సంకేతం ఇచ్చినట్లయింది. వారి సమావేశం ముగిసిన వెంటనే రాజ్ భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

శశికళకు మద్దతు ఇస్తున్న 128 మంది ఎమ్మెల్యేలలో చాలా మంది తమ వర్గంలో చేరవచ్చని పన్నీర్ సెల్వం ఆశపడ్డారు. కానీ ఆయన చురుకుగా పావులు కదపలేకపోవడంతో వారందరూ పళనిస్వామి పక్షాన్నే నిలిచారు. ఆ కారణంగా గవర్నర్ పళనిస్వామి వైపే మొగ్గు చూపారు. ఒకవేళ గవర్నర్ పళనిస్వామికే అధికారం అప్పజెప్పేమాటయితే పన్నీర్ సెల్వం పరిస్థితి, ఆయన రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారే అవకాశం ఉంది. శశికళ జైలుకి వెళ్ళి నష్టపోతే, పన్నీర్ సెల్వం రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారి నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


Related Post