త్వరలో తమిళనాడు గవర్నర్ మార్పు!

February 16, 2017


img

శశికళ నిన్న జైలుకి పోతూ పళనిస్వామిని ముఖ్యమంత్రి రేసులో దించి వెళ్ళిపోయారు. కనుక ఇప్పుడు పన్నీర్ సెల్వం ఆయనతో పోటీ పడవలసివస్తోంది. వారిరువురు కలిసి అన్నాడిఎంకె పార్టీని చీల్చుకొన్నట్లయితే, ఆ చీలికవర్గం మద్దతుతో అధికారం దక్కించుకొందామని ప్రతిపక్ష డిఎంకె పార్టీ నేత స్టాలిన్ కూడా ఆశపడుతున్నారు. వీరి ముగ్గురిలో  ఎవరు ముఖ్యమంత్రి అవబోతున్నారని అందరూ ఆత్రంగా ఎదురు చూస్తుంటే, భాజపా జాతీయ కమిటీ కార్యదర్శి హెచ్.రాజా నిన్న తిరుచ్చిలో పర్యటనలో మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే తమిళనాడుకు కొత్త గవర్నర్ ని నియమించబోతున్నట్లు ప్రకటించారు.

రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొని ఉన్న ఈ సమయంలో వీలైనంత త్వరగా ముఖ్యమంత్రిని ఏర్పాటుచేస్తామని చెప్పకుండా కొత్త గవర్నర్ ను నియమిస్తామని చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. గవర్నర్ విద్యాసాగర్ రావు ఈ మొత్తం వ్యవహారాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నారని, కనుక అయన తక్షణమే తన పదవి నుంచి తప్పుకోవాలని భాజపా రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేసిన నేపధ్యంలో హెచ్.రాజా చెప్పిన ఈ సరికొత్త విషయం వింటే సుబ్రహ్మణ్య స్వామి కేంద్రప్రభుత్వఅభిప్రాయాన్నే వ్యక్తం చేశారా? అనే అనుమానం కలుగుతోంది. 

కానీ ఈ మొత్తం వ్యవహారంలో విద్యాసాగర్ రావు చాలా చక్కగానే వ్యవహరించారని మళ్ళీ హెచ్.రాజా సర్టిఫికేట్ జారీ చేయడం విశేషం. జయలలిత మృతి తరువాత ఆయన క్షణం కూడా  ఆలస్యం చేయకుండా పన్నీర్ సెల్వం చేత ప్రమాణస్వీకారం చేయించి ప్రభుత్వం ఏర్పాటు చేయించారని, కానీ ఆ తరువాత జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఆయన చాలా ఆచితూచి సరైన నిర్ణయం తీసుకొంటున్నారని అన్నారు. ప్రజలు కూడా ఆయన నిర్ణయాన్ని సమర్దిస్తున్నారని అన్నారు. ఈ వ్యవహారాన్ని ఆయన చక్కగా నిర్వహిస్తున్నారని చెపుతున్నప్పుడు, ఇటువంటి క్లిష్ట సమయంలో గవర్నర్ మార్పు గురించి మాట్లాడవలసిన అవసరం ఏమిటో అర్ధం కాదు. ఆవిధంగా ప్రకటించడం గవర్నర్ విద్యాసాగర్ రావుకు అవమానకరం కాదా?


Related Post