తెలంగాణా రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అనగానే తెరాస, కాంగ్రెస్, తెదేపా, భాజపా, వామపక్షాలే గుర్తుకువస్తాయి తప్ప వైకాపా గుర్తురాదు. కారణం..ఆ పార్టీ ఎన్నడూ ప్రజాసమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడి తన ఉనికిని చాటుకొనే ప్రయత్నం చేయదు కనుకనే. తెలంగాణాలో వైకాపా ఎక్కడ ఉంది? అంటే లోటస్ పాండ్ లో అని చెప్పుకోవలసిన పరిస్థితి ఉంది. అయినా రాష్ట్రంలో మేము కూడా ఉన్నామని ప్రజలకు గుర్తు చేయడానికన్నట్లు ఆర్నెల్లకు ఏడాదికి ఓసారి ఏదో చిన్న హడావుడి చేస్తుంటుంది. 
తెలంగాణా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, కన్నెపల్లి, అన్నారం బ్యారేజీల నిర్మాణం చేపడుతున్న సంగతి తెలిసిందే. వాటి నిర్వాసిత రైతులకు మద్దతుగా పెద్దపల్లి జిల్లా వైకాపా అధ్యక్షుడు సెగ్గం రాజేష్ అధ్వర్యంలో ఫిబ్రవరి 20న మహాదేవ పూర్ మండలంలోని సూరారం గ్రామంలో వైకాపా రైతుదీక్ష నిర్వహించబోతోంది. ఆ దీక్ష కోసం వైకాపా రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి పార్టీ ప్రధాన కార్యాలయం లోటస్ పాండ్ లో నిన్న పోస్టర్ విడుదల చేశారు. ఆ సందర్భంగా (సాక్షి)మీడియాతో మాట్లాడుతూ భూసేకరణ చట్టం-2013 ప్రకారమే నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి నిర్మాణ పనులు మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు.
ఈ రెండున్నరేళ్ళలో రాష్ట్రంలో చాలా ప్రాజెక్టుల నిర్మాణపనులు జరిగాయి..ఇంకా జరుగుతున్నాయి కూడా. వాటిలో నష్టపోతున్న రైతుల తరపున రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ పోరాడుతూనే ఉన్నాయి ఒక్క వైకాపా తప్ప. ఇప్పుడు హటాత్తుగా అది ఎందుకు ఇంత శ్రమ తీసుకొంటోందంటే బహుశః తన ఉనికిని ప్రజలకు గుర్తు చేయడానికేనేమో? అని అనుమానం కలుగుతోంది.