తెలంగాణా ఏర్పడితే అందరి కష్టాలు తీరిపోతాయని ప్రజలు కలలుకన్నారు. కానీ అందరికీ అన్నం పెట్టే రైతన్న కష్టాలు తీరనే లేదు. కుమ్రంభీం జిల్లాలో రెబ్బెన మండలం కైరిగూడకు చెందిన జాదవ్ పరశురాం (50) అనే రైతన్న అప్పుల బాధలు భరించలేక శనివారం రాత్రి తన పొలంలో పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకొన్నాడు. పరశురాం తన రెండెకరాల పొలంలో పత్తి సాగుచేస్తున్నాడు. ఈ ఏడాది పంటలకు నీళ్ళు అందుతున్నాయి గనుక మంచి రాబడి వస్తుందనే ఆశతో రూ.2 లక్షలు అప్పు చేసి పక్కనే ఉన్న మరో 8 ఎకరాలను కౌలుకు తీసుకొని పత్తి వేశాడు. కానీ అతను ఆశించినట్లు దిగుబడి రాలేదు. దానితో తీవ్ర నిరాశ చెందిన పరశురాం చేసిన అప్పు తీర్చే మార్గం కానరాక ఆత్మహత్య చేసుకొన్నాడు. 
విజయ్ మాల్యా వంటి బడాబాబులు వేలకోట్లు ఎగవేసి విదేశాలు పారిపోయి దర్జాగా బ్రుతుకుతుంటే, కేవలం రూ.2 లక్షలు అప్పు తీర్చలేక పరశురాం ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. పరశురాం ఆత్మహత్యకు ఎవరిని వేలెత్తి చూపాలి? ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరుగకుండా ఏమి చర్యలు తీసుకోవాలి? మన అందరికీ అన్నం పెట్టే రైతన్న ఆర్ధిక సమస్యలతో ఆత్మహత్య చేసుకొంటుంటే అది మనకు ఏమాత్రం గౌరవం కాదు. కనుక అందరూ ఆలోచించాలి. ఆలోచించి ఒక కార్యాచరణ పధకం రూపొందించడం చాలా అవసరం. చనిపోయిన తరువాత నష్టపరిహారం అందించడం గొప్ప విషయం కాదు. రైతన్నలను చనిపోకుండా కాపాడుకోవడమే గొప్ప విషయం.