తెలంగాణా జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ నిన్న ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెరాస సర్కార్ ను తను వ్యతిరేకిస్తుండటానికి కారణాలను వివరంగా చెప్పారు. 
“నేను పదవులు అధికారం దక్కలేదనే బాధతోనో లేదా ఏదో ఒక రాజకీయ పార్టీకి కొమ్ముకాస్తూనో తెరాస సర్కార్ ను విమర్శించడం లేదు. తెరాస తన ఉద్యమ లక్ష్యాలు, ఆశయాలకు దూరంగా జరుగుతున్నందునే దానితో పోరాడవలసి వస్తోంది. అందరూ కలిసి తెలంగాణా సాధించుకొన్నాము. తెలంగాణా ఏర్పడి మన స్వంత ప్రభుత్వం వచ్చింది కనుక మన సమస్యలను దానికి మోర పెట్టుకోవచ్చు...అది మన సమస్యలన్నిటినీ సానుభూతితో అర్ధం చేసుకొని తీరుస్తుందని ప్రజలు చాలా ఆశ పడ్డారు. కానీ వారిని నిరాశపరుస్తూ తెరాస కూడా ఒక ఫక్తు రాజకీయపార్టీలాగే వ్యవహరించడం మొదలుపెట్టింది. ప్రజలకి, ప్రభుత్వానికి మద్య సంబంధమే లేనట్లు వ్యవహరిస్తోంది. రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్ధులు, సామాన్య ప్రజలు ఇలాగ అన్ని వర్గాలు ఏదో ఒక తీవ్ర సమస్యతో బాధలు పడుతూనే ఉన్నారు. కానీ తెరాస సర్కార్ వారి పట్ల కనీస సానుభూతి చూపకపోవడంతో వారిలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. దానినే నేను తెలంగాణా జెఎసి అనే ఒక వేదిక ద్వారా వ్యక్తం చేస్తున్నాను,” అని చెప్పారు ప్రొఫెసర్ కోదండరామ్.
“ఒకప్పుడు ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు వంటి నేతల హయంలో రాజకీయ వ్యవస్థలు వేర్వేరుగా ఉండేవి. అదేవిధంగా ఆయా సమయాలలో ప్రజల చైతన్య స్థాయిలు, ఆకాంక్షలు కూడా విభిన్నంగానే ఉండేది. ఆ నేతలు ముగ్గురూ ప్రజాభీష్టానికి అనుగుణంగా నడుచుకొన్నప్పుడు ప్రజలు వారిని నెత్తినపెట్టుకొని మోశారు. అందుకు వ్యతిరేకంగా వ్యవహరించినప్పుడు నిర్దాక్షిణ్యంగా దించేశారు. ఒక గొప్ప నేత అనుకొన్న వ్యక్తి పట్ల ప్రజలు రెండు రకాలుగా ఎందుకు వ్యవహరించారో తెరాస సర్కార్ కూడా ఆలోచిస్తే నేను దానితో ఎందుకు పోరాడుతున్నానో అర్ధం అవుతుంది.”
తెలంగాణా ఏర్పడక మునుపు, ఏర్పడిన తరువాత రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థలు, ప్రజల ఆకాంక్షలలో చాలా మార్పులు వచ్చాయి. తెరాస సర్కార్ ప్రజల ఆకాంక్షలను అర్ధం చేసుకోకుండా రాజకీయంగా బలపడేందుకు మాత్రమే ప్రయత్నిస్తోంది. ఎప్పడైతే దానికి ఉద్యమ ఆశయాలతో, లక్ష్యాలతో, సామాన్య ప్రజలతో లింక్ తెగిపోయిందో అప్పుడే వారు దానికి దూరం కావడం మొదలుపెట్టారు.
తెరాస రాజకీయంగా చాలా బలపడి ఉండవచ్చు. కానీ ప్రజలకు దూరమయిన ప్రభుత్వాలు గతంలో ఏవిధంగా తిరస్కరణకు గురయ్యాయో తెరాసకు కూడా అటువంటి చేదు అనుభవమే ఎదురయ్యే అవకాశం ఉందని చెపుతున్నాను. తెరాస కూడా చేజేతులా అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని నా కోరిక.
తెలంగాణా భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రజల సమస్యలు, వారి అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాము తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదు. ప్రజా సమస్యల గురించి ప్రభుత్వాన్ని అడగడం తప్పని మేము భావించడం లేదు. అది మా బాధ్యతగా భావిస్తున్నాము. అందుకే ప్రభుత్వాన్ని గట్టిగానే నిలదీస్తున్నాము. ఆ విషయంలో వెనకడుగు వేసే ఆలోచన మాకు లేదు. అదే మా మద్య విభేదాలకి దారి తీస్తోంది,” అని చెప్పారు ప్రొఫెసర్ కోదండరామ్.