హైకోర్టు ఏమి చెపుతుందో?

February 13, 2017


img

తమిళనాడు అన్నాడిఎంకె పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ తనకు మద్దతు ఇస్తున్న 128మంది ఎమ్మెల్యేలను చెన్నై శివార్లలో గల గోల్డెన్ రిసార్ట్ లో నిర్బంధించారంటూ దాఖలైన పిటిషన్ పై స్పందించిన మద్రాస్ హైకోర్టు, వారి యోగక్షేమాల గురించి కనుగొని అఫిడవిట్ దాఖలు చేయాలనీ రాష్ట్ర పోలీస్ డిజిపిని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు నిన్న గోల్డెన్ రిసార్ట్ కు వెళ్ళి ఎమ్మెల్యేల వాంగ్మూలం రికార్డు చేసుకొని వచ్చారు. దానిని ఈరోజు మద్రాస్ హైకోర్టుకి సమర్పించనున్నారు. దానిలో వారు ఏమని చెప్పబోతున్నారో తెలియదు. ఒకవేళ ఆ అఫిడవిట్ లో ఎమ్మెల్యేలను శశికళ నిర్బంధించి ఉంచారని పేర్కొన్నట్లయితే శశికళ తీవ్ర ఇబ్బందులలో పడతారు. ఎమ్మెల్యేలు స్వచ్చందంగానే అక్కడ ఉంటున్నారని పేర్కొంటే, వారిని శశికళ నిర్బంధించిందని వాదిస్తున్న పన్నీర్ సెల్వంకు ఎదురుదెబ్బ అవుతుంది.  

ప్రస్తుతం పన్నీర్ సెల్వం ఆపధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తునందున, పోలీసులు ఆయన అధీనంలోనే పనిచేస్తున్నట్లు భావించవచ్చు. కనుక వారు ఆయన ఒత్తిడికిలోని శశికళకు వ్యతిరేకంగా అఫిడవిట్ దాఖలు చేసే అవకాశాలు లేకపోలేదు. మరికొద్ది సేపటిలో మద్రాస్ హైకోర్టు ఈ కేసుపై విచారణ చేపట్టి తీర్పు చెప్పబోతోంది. కనుక ఇరు వర్గాలలో తీవ్ర ఉత్కంట నెలకొని ఉంది. 


Related Post