తమిళనాడు రాజకీయాలు చల్లారిపోయిన పరాటాలాగ సాగుతూనే ఉన్నా సెల్వం, శశికళ వడ్డిస్తున్న మంచి పసందైన మసలాకర్రీ వంటి వ్యూహాలు ఎక్కడా బోర్ కొట్టించడం లేదు. ఈరోజు శశికళ వర్గం నుంచి ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎంపిలు గోడ దూకేసి సెల్వం పక్కన చేరిపోయారు. 
రోజులు గడుస్తున్న కొద్దీ ఒకరొకరుగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపిలు చేజారిపొతుండటం చూసి తీవ్ర ఆందోళన చెందిన శశికళ హటాత్తుగా ఎవరూ ఊహించలేని వ్యూహం అమలుచేయడానికి సిద్దం అయ్యారు. ఆమె ముఖ్యమంత్రి రేసులో నుంచి తప్పుకొని తనకు గట్టి మద్దతుదారుడైన ఎమ్మెల్యే సెంగొట్టియన్ న్ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ముందుకు తీసుకురాబోతున్నట్లు తాజా సమాచారం. అప్పుడు గవర్నర్ విద్యాసాగర్ రావు తప్పనిసరిగా ఆయనను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించవలసి ఉంటుంది. పార్టీలో, ప్రజలలో, చివరికి మీడియాలో తన పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందనే సంగతి శశికళ గ్రహించినట్లే ఉన్నారు. కానీ ఆ కారణంగా అధికారం తన చేతిలో నుంచి జారిపోకుండా చూసుకోనేందుకే ఈ వ్యూహం అమలుచేస్తున్నట్లు చెప్పవచ్చు.
ఒకప్పుడు సోనియా గాంధీ ప్రధానమంత్రి కావాలనుకొన్నప్పుడు ఇలాగే తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో తన చెప్పినట్లు నడుచుకొనే డాక్టర్ మన్మోహన్ సింగ్ ను ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి ఆమే దేశాన్ని పాలించారు. ఇప్పుడు శశికళ కూడా అచ్చంగా అదే వ్యూహం అమలుచేయడానికి సిద్దం అవుతున్నట్లు కనిపిస్తుంది. కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి చీలిక లేదు కనుక సోనియా గాంధీ వ్యూహం ఫలించింది. కానీ అన్నాడిఎంకె పార్టీలో పన్నీర్ సెల్వం పార్టీని చీల్చుతున్నారు కనుక శశికళ వ్యూహం ఫలిస్తుందో లేదో చూడాలి.
ఈరోజు ఆమె గవర్నర్ విద్యాసాగర్ రావుకు మళ్ళీ ఒక లేఖ వ్రాశారు. తనకు ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం కల్పించవలసిందిగా దానిలో కోరారు. ఆయన ముందు తన ఎమ్మెల్యేల బలప్రదర్శన చేసేందుకు కూడా అనుమతి కోరారు. కానీ గవర్నర్ స్పందించకపోవడంతో ఆమె నేరుగా తన ఎమ్మెల్యేలను దాచిపెట్టిన గోల్డెన్ రిసార్ట్స్ వద్దకు వెళ్ళి వారితో సమావేశం అయ్యారు. ఈ విషయం తెలియజేస్తూ గవర్నర్ కు ఆమె మళ్ళీ మరో లేఖ వ్రాయవచ్చు. ఒకవేళ ఇప్పటికీ గవర్నర్ తన లేఖలను పట్టించుకోకపోతే అప్పుడు మెరీనా బీచ్ లో జయలలిత సమాధి వద్ద తన ఎమ్మెల్యేలతో కలిసి ధర్నాకు కూర్చోవచ్చు. అదే చేత్తో మద్రాస్ హైకోర్టులో ఒక పిటిషన్ కూడా వేయవచ్చు.