ఎన్.ఆర్.ఐ.లు ఆలోచించవలసిన సమయం ఇదే!

February 11, 2017


img

ఐటి రంగానికున్న క్రేజ్, డిమాండ్ కారణంగా దేశంలో పుట్టగొడుగులు మాదిరిగా వెలిసిన అనేక ఇంజనీరింగ్ మరియు ఐటి శిక్షణా సంస్థలు ఏటా లక్షలాదిమంది ఐటి నిపుణులని ఉత్పత్తి చేస్తుండటంతో, డిమాండ్-సప్లై సమతుల్యత దెబ్బతింది. ఇది సరిపోదన్నట్లు ట్రంప్ దొరగారి ఆంక్షల కారణంగా ఐటి రంగం భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందిప్పుడు. అమెరికా ఆంక్షలు విదించినంత మాత్రాన్న ప్రపంచంలో అన్ని దేశాల తలుపులు మూసివేసినట్లు కాదు కానీ రేపు వేరే దేశంలో కూడా మరో ట్రంప్ పుట్టుకు రాడనే నమ్మకం ఏమిటి? 3-4 దశాబ్దాల క్రితమే అమెరికాలో స్థిరపడినవారికి కూడా ఇప్పుడు తీవ్ర అభద్రతాభావానికి గురవుతున్నారు. ఇది చాలా విచారకరమే కాకుండా అందరూ తమ భవిష్యత్ గురించి గట్టిగా ఆలోచించవలసిన అవసరం ఏర్పడింది.

125 కోట్లు జనాభా ఉన్న భారత్ ప్రపంచంలో కెల్లా అతిపెద్ద మార్కెట్ అని గుర్తించిన అనేక సంస్థలు ఇక్కడికి వచ్చి తమ ఉత్పత్తులను అమ్ముకొని ఇబ్బడి ముబ్బడిగా డబ్బు సంపాదించుకొంటుంటే, ప్రవాస భారతీయులు, భారత్ సంస్థలు అమెరికా, ఆస్ట్రేలియాలకు దయాదాక్షిణ్యాలపై ఆధారపడవలసిన అవసరం ఉందా? 

ఎంపి కవిత నిన్న అమరావతిలో మహిళా పార్లమెంటు సదస్సులో మాట్లాడుతూ "నోట్ల రద్దు సమయంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కూడా చాలా అయోమయం చెందారు కానీ మన గ్రామాలలో చదువుకోని గ్రామీణ మహిళలు తమకు వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే చాలా సమర్ధంగా కుటుంబాలను నడిపించారు," అని అన్నారు. ఒక గ్రామీణ మహిళ అంత సంక్షోభాన్ని ఎదుర్కొని తట్టుకొని నిలబడగలిగినప్పుడు, ఆర్ధికంగా చాలా బలంగా ఉన్న మన ప్రవాస భారతీయులు, ఐటి సంస్థలు భారత్ లో మనుగడ సాగించలేరా? ఆలోచించడం చాలా అవసరం. 

బాబా రాందేవ్ వంటి ఒక సన్యాసి రూ.450 కోట్లు వార్షిక టర్నోవర్ తో వ్యాపారాలు చేయగలుగుతుండటమే భారత్ మార్కెట్ శక్తి సామర్ధ్యాలకు నిలువెత్తు నిదర్శనంగా కనబడుతోంది. అనేకమంది బాబాలు, వివిధ మత గురువులు టీవీ ఛానళ్ళు నడుపుతూ కోట్లు సంపాదించుకోవడం అందరూ కళ్ళారా చూస్తూనే ఉన్నారు. ఇవన్నీ భారత్ లో గల అనేక అవకాశాలకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. భారత్ జనాభా అవసరాలను తీర్చగల శక్తి యావత్ ప్రపంచానికి కూడా ఉండదు. కనుక ఆ ప్రయత్నమేదో మనమే చేసుకొంటే మంచిది కదా? అందరూ ఆలోచించాలి.    

మన తెలుగు రాష్ట్రాలకి సంబంధించినంత వరకు చూసుకొన్నట్లయితే, రెండు ప్రభుత్వాలు పరిశ్రమలు, వ్యాపారాలు స్థాపనకు పోటాపోటీగా చాలా ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. అలాగే వాటి స్థాపన ప్రక్రియను కూడా చాలా సరళం చేసాయి. ఔత్సాహికులకు తగిన సహాయసహకారాలు అందించడానికి ఇంక్యూబేటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాయి. 

భారత్ మార్కెట్ల నుంచి అనేక దేశవిదేశీ సంస్థలు పుష్కలంగా లాభాలు మూటగట్టుకొంటున్నప్పుడు మనం ఆ పని చేయలేమా? ఎందుకు చేయలేము? మనకున్న అవరోధాలు, బలహీనతలు ఏమిటి? వాటిని ఏవిధంగా అధిగమించాలి? అని ఆలోచించవలసిన సమయం ఇదే. ఇటువంటి విపత్కర పరిస్థితులు సృష్టించి మనలో ఇటువంటి ఆలోచనలు కల్పించినందుకు ట్రంప్ కే కృతజ్ఞతలు తెలుపుకోక తప్పదు. 


Related Post